మెదడు దిక్సూచి వ్యవస్థకు నోబెల్!
స్టాక్‌హోం(స్వీడన్): పరిసరాల మధ్య మనం ఎక్కడున్నాం? మన స్థానాన్ని కచ్చితంగా ఎలా అంచనా వేసుకుంటున్నాం? పరిసరాల చిత్రపటాన్ని ఆవిష్కరించుకుని, సులభంగానే అటూ, ఇటూ ఎలా కదలగలుగుతున్నాం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే. అదే మన మెదడులో సమర్థమైన దిక్సూ చి వ్యవస్థ ఉండటం వల్ల! అందుకే.. మనిషి కదలికలకు అత్యంత కీలకమైన మెదడులోని అంతర్గత దిక్సూచి వ్యవస్థ(ఇన్నర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్-జీపీఎస్)ను ఆవిష్కరించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ బహుమతి వరించింది. పరిసరాలను గమనిస్తూ.. మనిషి మెదడు ఎలా దిశానిర్దేశం చేసుకుంటుందన్న అంశాన్ని వివరించిన బ్రిటిష్-అమెరికన్ శాస్త్రవేత్త జాన్ ఓ కీఫ్(74), నార్వేజియన్ దంపతులు ఎడ్వర్డ్ మోసర్(52), మే-బ్రిట్ మోసర్(51)లు ఈ ఏడాది వైద్యరంగ నోబెల్‌ను సంయుక్తంగా గెలుచుకున్నారు.
శతాబ్దాల తరబడి శాస్త్రవేత్తల మెదళ్లను తొలచిన ప్రశ్నకు వీరు ముగ్గురూ సమాధానం కనుగొన్నారని ప్రశంసిస్తూ.. సోమవారం నోబెల్ జ్యూరీ వీరిని విజేతలుగా ప్రకటించింది. మనిషి మెదడు దిక్సూచీ వ్యవస్థ ఆవిష్కరణ వల్ల.. ప్రధానంగా అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేసేందుకు వీలు కానుందని జ్యూరీ పేర్కొంది. పరిసరాల మధ్య స్థానాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే మెదడులోని నాడీకణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు సంబంధిత జ్ఞాపకశక్తి కోల్పోయి తికమక పడుతుంటారు. మెదడులోని అంతర్గత జీపీఎస్ వ్యవస్థను అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి వారికి చికిత్స చేసేందుకు మార్గం సుగమం అయిందని జ్యూరీ అభిప్రాయపడింది.
అలాగే వైద్యరంగంలో నోబెల్‌ను గెలుచుకున్న 11వ మహిళగా మే-బ్రిట్ మోసర్ నిలిచారు. విజేతలకు అవార్డు కింద 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు(రూ. 6.81 కోట్లు)అందనున్నాయి. ఇందులో జాన్ ఓ కీఫ్‌కు సగం, మిగతా ఇద్దరికి మరో సగం దక్కనుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులను కూడా వరుసగా రోజుకొకటిగా శనివారం దాకా ప్రకటిస్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను మాత్రం సోమవారం ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబరు 10న స్టాక్‌హోంలో అవార్డులు ప్రదానం చేస్తారు. కాగా, గతేడాది వైద్యరంగం(ఫిజియాలజీ)లో నోబెల్ అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. శరీర కణాల మధ్య ఇన్సులిన్ రవాణాను ఆవిష్కరించినందుకు వారికి ఈ బహుమతి దక్కింది.
మెదడు జీపీఎస్ ఆవిష్కరణ ఇలా...
యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుడైన జాన్ ఓ కీఫ్ తొలిసారిగా 1971లో మెదడు జీపీఎస్ వ్యవస్థకు సంబంధించిన నాడీకణాలను ఎలుక మెదడులో కనుగొన్నారు. మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంలో ఈ ప్రత్యేక స్థాన నాడీకణాలు(ప్లేస్ సెల్స్) క్రియాశీలం కావడం వల్ల ఎలుక ల్యాబ్‌లో తన స్థానాన్ని కచ్చితంగా అంచనా వేసుకుంటోందని, దీనివల్ల ఆ గది చిత్రపటం ఎలుక మెదడులో ఆవిష్కృతం అవుతోందని ఆయన గుర్తించారు. తర్వాత మూడు దశాబ్దాలకు 2005లో నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మే-బ్రిట్, ఎడ్వర్డ్ మోసర్ దంపతులు ఈ మెదడు జీపీఎస్‌లో మరో కీలక నాడీకణ వ్యవస్థను కనుగొన్నారు. పరిసరాల చిత్రపటాన్ని ఆవిష్కరించిన తర్వాత స్థానాన్ని అంచనా వేయడం, దారి తెలుసుకోవడం అనే అంశాల మధ్య సమన్వయానికి కీలకమైన సమన్వయ నాడీకణాలు (గ్రిడ్ సెల్స్)ను వీరు గుర్తించారు. ఈ రెండు రకాల కణాల వ్యవస్థ మనిషి మెదడులోనూ ఇలాగే ఉందని ఇటీవ లి పరిశోధనల్లో నిరూపించారు.