మిమ్మల్నీ, మీ జీవితాన్నీ మీకు కావలసినట్టు మలచుకోవడం ఎలా?
సద్గురూ! నేను నన్నూ, నా జీవితాన్నీ నాకు నచ్చిన విధంగా మలచుకోవాలని ఆశిస్తున్నాను. అందుకోసం ఎవేవో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ సఫలం కావటం లేదు. ఈ విషయంలో నాకేదైనా సలహా ఇవ్వగలరా?
ప్రతీ మనిషి తనకు తెలిసో, తెలియకో ఈ జీవితమనే ప్రక్రియలో తనకొక ప్రతిరూపాన్నీ (ఇమేజ్‌ని), ఒక వ్యక్తిత్వాన్నీ సృష్టించుకుంటాడు. మీలో మీరు సృష్టించుకున్న ఈ ప్రతిరూపానికి వాస్తవికతతో సంబంధమే ఉండదు. ఈ ప్రతిరూపానికీ, మీ అంతర్గత స్వభావానికీ కూడా సంబంధమే ఉండదు. ఇది మీకై మీరే, అది కూడా చాలాసార్లు మీకు తెలియకుండానే సృష్టించుకున్న ఒక ప్రతిరూపం. చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే చేతనంగా వారి ప్రతిరూపాన్ని సృష్టించుకుంటారు. మిగిలిన వారు అందరూ అచేతనంగా, వారి బాహ్య పరిస్థితులను, లేదా వారి సహజ ధోరణులను బట్టి ఈ ప్రతిరూపాన్ని సృష్టించుకుంటారు.
ఇప్పుడు మనం ఈ ప్రతిరూపాన్ని స్పృహతో, మనకి కావలసినట్లు ఎందుకు సృష్టించుకోకూడదు? మీకు తగినంత తెలివితేటలు ఉంటే, మీరు తగినంత చేతనతో ఉంటే, మీరు మీ ప్రతిరూపాన్ని మీకు ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చు. అది సాధ్యమే! కానీ మీరు మీ ప్రతిరూపాన్ని వదిలి వేయటానికి సిద్ధంగా ఉండాలి. అందుకు మీరు తగినంత చేతనతో ఉండాలి. మీరు మీకు తగిన ప్రతిరూపాన్ని, మీ చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా, తక్కువ సంఘర్షణతో ఉండే ఒక కొత్త ప్రతిరూపాన్ని సృష్టించుకోవచ్చు. మీ అంతర్గత స్వభావానికి దగ్గరగా ఉన్న ప్రతిరూపాన్ని మీరు సృష్టించుకోవచ్చు. ఎటువంటి ప్రతిరూపం మీ అంతర్గత స్వభావానికి దగ్గరగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దయచేసి చూడండి, మీ అంతర్గత స్వభావం ఎంతో నిశ్శబ్దమైనది, చాలా సూక్ష్మమైనది, కానీ చాలా శక్తిమంతమైనది.
ఇలా చేయండి...
ఒకటి రెండు రోజులు ఆలోచించి, మీకు ఎలాంటి ప్రతిరూపం కావాలో నిర్ణయించుకోండి. మీ ఆలోచనా, భావోద్వేగాల ప్రాథమిక స్వభావం ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోండి. మీలోని స్థూలమైన అంశాలను, అంటే కోపం వంటి మీ పరిమితులను మీరు తొలగించుకోవాలని నిర్ణయించుకోండి. మీరు కొత్త ప్రతిరూపాన్ని సృష్టించకముందే, మీరు ఇప్పుడు సృష్టిస్తున్నది మునుపటి దానికంటే నిజంగా మెరుగైనదా, కాదా అని చూడాలి. అంతా నిర్ణయించుకున్న తర్వాత, మీరు ప్రశాంతంగా ఉండే సమయాన్ని ఎంచుకోండి. మీ వీపుని దేనికైనా ఆనించి విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఇతరులు మిమల్ని ఎలా అనుభూతి చెందాలో ఒకసారి ఊహించండి. ఒక సరికొత్త వ్యక్తిని సృష్టించండి. మీకు వీలైనంత వివరంగా చూడండి. ఈ కొత్త ప్రతిరూపం ఎక్కువ మానవత్వంతో, ఎక్కువ సమర్థతతో, ఎక్కువ ప్రేమతో ఉందో లేదో చూడండి.
ఎంత బలంగా వీలైతే అంత బలంగా ఈ కొత్త ప్రతిరూపాన్ని ఊహించుకోండి. దీన్ని మీలో మీరు సజీవం చేయండి. మీ ఆలోచనలకి లేదా మీ ఊహలకి తగినత శక్తి ఉంటే, అవి మీ కర్మ బంధనాలను కూడా తెంచగలవు. తద్వారా మీరు మీ ప్రస్తుత ఆలోచనల, భావోద్వేగాల, శక్తిసామర్థ్యాల పరిమితులని దాటవచ్చు. మీకై మీరు, మీకు నచ్చిన విధంగా మీకొక కొత్త ప్రతిరూపాన్నీ, వ్యక్తిత్వాన్నీ సృష్టించుకోవచ్చు.
ప్రెజెంటేషన్: డి.వి.ఆర్. భాస్కర్