ఎనిమిది మంది భారతీయ జాలర్లు విడుదల!
గత నెలలో అరెస్ట్ చేసిన ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను వెంటనే విడిచిపెట్టాలని శ్రీలంకలోని మన్నార్ కోర్టు శుక్రవారం ఆ దేశ నావికాదళాన్ని ఆదేశించింది. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఇన్నోసెంట్ ఫిషర్మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు అరులానందం రామేశ్వరంలో వెల్లడించారు. గత నెల15న వారంతా సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. అందులోభాగంగా శ్రీలంకా అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని, దాంతో వారిని ఆ దేశ నావికాదళం అదుపులోకి తీసుకుందని ఆయన తెలిపారు.
అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టారని చెప్పారు. దీంతో వారిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా శ్రీలంకలోని వివిధ జైళ్లలో 41 మంది భారతీయ మత్య్సకారులు మగ్గుతున్నారని, వారిని కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వారి రిమాండ్ గడవును కోర్టు ఈ నెల 22 వరకు పోడిగించిందని అరులానందం ఈ సందర్భంగా గుర్తు చేశారు.