లోన్ల పేరుతో మహిళలకు టోపీ
మదనపల్లెక్రైం: మోసపోయే వాళ్లున్నంత కాలం మోసాలు జరుగుతూనే ఉంటాయనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. లోను పేరుతో ఓ ఘరానా మోసగాడు అమాయక మహిళలను బురిడీ కొట్టిం చాడు. రూ.లక్షల్లో వసూలు చేసుకుని పారిపోయాడు. తీరా మోసపోయామని తెలుసుకుని అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి బుధవారం పోలీసులకు అప్పగిం చారు. బాధితుల కథనం మేరకు.. రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ యర్రప్పల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు పీ.ఆంజప్ప(35) వ్యవసాయం చేసుకుని జీవించేవాడు.
అమాయక మహిళలను బుట్టలో వేసుకుంటే సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించాడు. సాయంత్రం సమయంలో మదనపల్లెలోని అప్పారావుతోట, దేవళంవీధి, ఈశ్వరమ్మ కాలనీలో ద్విచక్ర వాహనంలో వెళ్లి మహిళలను పోగుచేసి రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారికి కలెక్టర్ కార్యాలయం నుంచి 50 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల చొ ప్పున లోన్లు మంజూరు చేయిస్తానని చె ప్పేవాడు. మొదట ఎవరూ నమ్మలేదు. ఒక మహిళ మాత్రం నమ్మి కొంత డబ్బు అతని చేతిలో పెట్టింది.
మరుసటి రోజు వచ్చి లోను మంజూరైందంటూ బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఓ నకిలీ కాగితాన్ని చూపాడు. ఆశపడ్డ మహిళలు ఒక్కొక్కరుగా అతనికి డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. రత్నమ్మ కుటుంబం లో ముగ్గురికి రూ.12 లక్షలు లోను ఇప్పిస్తానని చెప్పడంతో రూ.1.30 లక్షలు ఇ చ్చారు. కృష్ణవేణి రూ.63 వేలు, లలితమ్మ రూ.28వేలు, భారతి రూ.5వేలు, అమ్మాజాన్ రూ.10వేలు, పద్మావతి రూ.10 వేలు, నారమ్మ రూ.60వేలు చొప్పున మోసగాడికి ఇచ్చారు. మరి కొంతమంది మహిళలు కూడా డబ్బు కట్టారు.
రూ.13 లక్షల లోను మంజూ రైందని విత్ డ్రాయిల్ ఫారంలో రాసి నారమ్మకు ఇచ్చాడు. అమాయకురాలైన ఆమె బ్యాంకు వెళితే తిప్పి పంపారు. ఇలా చాలామందికి విత్‌డ్రాయిల్ ఫామ్స్‌లో డబ్బు రాసిచ్చి తీసుకొమ్మని మోసగించాడు. ఇతని వెనుక మరెవరో ఉన్నట్లు మహిళలు చెబుతున్నారు. డబ్బు కోసం వచ్చినపుడు ఎవరితోనే ఫోన్లో మాట్లాడించేవాడని తెలిపారు. ఏడాదిగా దాక్కున్న ఆంజప్పను బుధవారం బాధితులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.