సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందజేసిన రాజస్థాన్ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును ప్రకటించింది. జైపూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఈ – ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్’లో శుక్రవారం కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా సీవీ ఆనంద్ ఈ అవార్డు అందుకున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసేలా, మద్యం తాగి వాహనాలు నడపటం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసుల్లో ఈ – చలాన్లను ఆనంద్ ప్రవేశపెట్టారు. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు, వీడియో కాన్ఫరెన్స్ విధానం, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వాహనాలకు జీపీఎస్ ఉపయోగించి ఎన్నికల అక్రమాలను అరికట్టారు.
దీనికి గాను రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో రూ.23 కోట్ల నగదును సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటు, గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి సత్ఫలితాలు రాబట్టారు. ఈ వినూత్న పద్ధతులు జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్శించాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంతో ఇన్నోవేటివ్ సమ్మిట్‌కు హాజరైన సీవీ ఆనంద్ అక్కడ కీలకోపన్యాసం చేశారు. తాను చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.