‘డ్రోన్’ సహాయంతో వినూత్న పరిశోధనలు
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వినూత్న పరిశోధనలకు వేదిక కానుంది. ఆకాశంలో విహరిస్తూ ఛాయాచిత్రాలు, వీడియోల ద్వారా సమాచారాన్ని భూమికి పంపే ‘డ్రోన్’ను ఇక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు. శుక్రవారం పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇటీవల అమెరికా నుంచి ప్రత్యేకంగా దీనిని సమకూర్చుకున్నారు. ఈ డ్రోన్‌కు అమర్చిన శక్తిమంతమైన కెమెరా ద్వారా 200 అడుగుల ఎత్తు పైనుంచి స్పష్టమైన ఛాయాచిత్రాలతోపాటు వీడియోలను తీస్తుంది.
దీంతో ఎత్తుగా పెరిగే కంది, మొక్కజొన్న తదితర పంటల్లో తెగుళ్లు, కీటకాల ద్వారా జరిగే నష్టపరిమితిని అంచనా వేసే అవకాశం ఉంది. పొలాల్లోని పోషకాల హెచ్చు తగ్గులను కూడా విశ్లేషించేందుకు ఆస్కారముంది. భారీ విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వివిధ కారణాలతో నష్టాల మదింపునకు డ్రోన్ ద్వారా సాధ్యమవుతుంది.
డ్రోన్ ద్వారా తీసే చిత్రాలను విశ్లేషించి రైతులకు ఆయా సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సమాచారాన్ని చేరవేయవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రాంత పరిస్థితులకనుగుణంగా పరిశోధనలను వినియోగంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సి.సుధాకర్ చెప్పారు. ఇలా పరిశోధనలు చేయడం దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు.