కేన్సర్ మందుల తయారీలో ‘గ్రేటర్’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వివిధ రకాల కేన్సర్ల మందుల తయారీకి రాజధాని గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. నగరంలో 500కి పైగా అతిపెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని నిత్యం ప్రతి ముగ్గురు వ్యక్తులు వాడేమందుల్లో ఒకరు వాడేవి హైదరాబాద్‌లో తయారైన మందులే. నగరంలో తయారవుతున్న పలు అరుదైన డ్రగ్స్ అమెరికా, యూరప్, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలకు ఎగుమతవుతున్నాయి’ అని ఇన్నోవేట్ -16 కన్వీనర్, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, డాక్టర్ వి. రామమోహన్ గుప్తా తెలిపారు.
రవీంద్రభారతిలో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇస్పోర్ ఇండియా తెలంగాణ చాప్టర్ సంయుక్తంగా జాతీయ ఔషధ విధానంపై అంతర్జాతీయ సదస్సు(ఇన్నోవేట్-16) నిర్వహించాయి. సదస్సులో పాల్గొన్న రామమోహన్ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యాంటీ కేన్సర్ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్‌లోని పరిశ్రమల్లోనే తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రధానంగా బల్క్ డ్రగ్స్, ఫార్మేషన్ డ్రగ్స్ తయారు చేస్తారన్నారు. రెడ్డీస్, హెటిరో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెడిసిన్‌ను తయారు చేయటంలో పేరెన్నిక గన్నవన్నారు. కొన్ని కంపెనీలు యాంటీ సైకో మెడిసిన్‌ను కూడా ఇక్కడ తయారు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చని తెలిపారు.
ముగిసిన అంతర్జాతీయ సదస్సు
యూజ్‌ఫుల్ నేషనల్ మెడికల్ పాలసీ(జాతీయ ఔషధ విధానం) పై రెండు రోజుల పాటు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సదస్సు గురువారం ముగిసిందని డాక్టర్ రామమోహన్ తెలిపారు. ఇందులో మలేసియా, థాయ్‌లాండ్ నుంచి మూడు వర్సిటీ ప్రతినిధులు పాల్గొని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చే శారని తెలిపారు. మలేసియా టైలర్స్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ పీటీ థామస్ సేప్‌రేషనల్ అపాడ్ బుక్ గుడ్ క్వాలిటీ డ్రగ్స్ అనే అంశంపై చేసిన ఉపన్యాసం ఫార్మసీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకారిగా ఉండబోతుందని చెప్పారు. మలేసియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జోరియా అజీజ్ ప్రత్యేకంగా మెటా అనాలిసిస్‌పై చేసిన ప్రసంగం ఫార్మసీ విద్యార్థులకు ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు.
ఐటీ పార్కు సిటీకి ఒక వైపు ఉన్నట్లుగానే ఫార్మా హబ్ కూడా శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్నదని రామమోహన్ గుప్తా తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు మందుల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 12 మంది ఫార్మసీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఫార్మసీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ ఔషధ విధానంపై నిర్వహించిన పోస్టర్ల ప్రదర్శన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.