మహిళా మిస్సైల్
విశాఖపట్నం : ఎన్ 32 విమాన పైలట్.. ఎయిర్‌ఫోర్స్‌లో స్క్వాడ్రన్ లీడర్.. తండ్రి, సోదరుల వారసత్వంగా గగనతలంలో దేశం కోసం పోరాడుతున్న సాహసి.. ఆత్మవిశ్వాసంతో నేల నుంచి నింగిలోకి దూసుకుపోతున్న మిసైల్ ఆమె.. నిత్యం సవాళ్లు.. ప్రతి నిత్యం ప్రమాదాలతో సావాసం చేసే సాహస వనితలు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ప్రతిరూపం ఆమె.. పేరు నీలమ్ హుడా. విపత్తుల నిర్వహణపై తూర్పు నావికాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రకంపన’లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆమెను ‘సాక్షి’ ఐఎన్ఎస్ డేగాలో పలకరించింది.
ఉత్తేజభరితమైన కెరీర్ వివరాలు ఆమె మాటల్లోనే..
హర్యానా రాష్ర్టంలోని రోతక్ జిల్లా అస్సోన్ గ్రామం నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అడుగుపెట్టాను. నాన్న రామ్మోహన్ ఇదే విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. సోదరుడు ప్రవీణ్ హుడా ఆర్మీలో పనిచేస్తున్నారు. వారిద్దరి ప్రభావంతోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. ఎయిర్‌ఫోర్స్ విమానం ఎన్ 32 (ఇటీవల ఎన్ఏడీ ఉద్యోగులను చెన్నై నుంచి అండమాన్‌కు తీసుకువెళుతూ అదృశ్యమైంది ఇలాంటి విమానమే) మెడికల్ విమానంలో పైలట్‌గా ఉన్నాను. విపత్తులు ఎదురైనప్పుడు వెంటనే అక్కడికి చేరుకుంటాం. మా విమానంలో దాదాపు 25 మందికి వైద్యం అందించగలం. సురక్షిత ప్రాంతానికి తరలించగలం. ప్రతి రంగంలోనూ సవాళ్లు ఉంటాయి. మహిళలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి సవాళ్లు ఎదుర్కోవాలి.