పురుగుల వంటకాల హోటల్
లండన్: భారత్ లాంటి దేశాల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నారనే వార్తలొస్తే...అది ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి పరాకాష్టగా భావిస్తాం. కానీ ఇప్పుడా పురుగుల అన్నమే మానవుడికి కావాల్సిన పోషక విలువలుగల ప్రశస్త భోజనమని బ్రిటన్‌కు చెందిన డాక్టర్ సారా బేనన్, టీవీ ప్రెజెంటర్ చెబుతున్నారు. చెప్పటమే కాదు, పసందైన వంటకాల్లో ప్రపంచ అవార్డు పొందిన ఆండీ హోల్క్రోఫ్ట్తో కలసి లండన్‌లో క్రిమికీటకాల హోటల్‌నే పెడుతున్నారు. అందుకు లైసెన్స్ కూడా తీసుకున్నారు. త్వరలో ప్రారంభించనున్న ఈ హోటల్లో 24 గంటలపాటు వివిధ రకాల క్రిమికీటకాలతో తయారుచేసిన వివిధ రకాల వంటకాలను వేడివేడిగా వడ్డిస్తామని చెబుతున్నారు. ఈ హోటల్ కోసమే ఆమె లండన్‌లో 2013లోనే ఓ ‘బగ్ ఫామ్’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పొలంలో కోట్లాది క్రిమికీటకాలను పెంచుతున్నారు.
క్రిమికీటకాలను రోజూ తినేవారు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఉన్నారన్నది అంచనా. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకోవడాన్ని శాస్త్రవిజ్ఞాన పరిభాషలో ‘ఎంటమోఫాగి’ అని పిలుస్తారు. ఇలాంటి ఆహారాన్ని తీసుకొనే నాన్ వెజిటేరియన్లు ఇంతమంది ఉన్నప్పటికీ ఇంతవరకు వాటిని వడ్డించే హోటల్ ప్రపంచంలో ఎక్కడా లేదన్న వాస్తవాన్ని గ్ర హించి అలాంటి హోటల్‌ను పెట్టాలన్నది సారా బేనన్ సంకల్పం. ఆమె సంకల్పం ఇప్పుడు నెరవేరబోతున్నది. తాను పెడుతున్న హోటల్‌కు ‘గ్రబ్ కిచెన్’ అని నామకరణం కూడా చేశారు. క్రిమికీటకాలను తినేవారు కూడా తాము తింటామని బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితులు లేనికారణంగా ఈ వంటకాలను ప్రోత్సహించేందుకు ఇంకా పెద్ద కసరత్తే చేయాల్సి ఉందని ఆమె చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మానవులు ఆహారంగా తీసుకోగల క్రిమికీటకాలు దాదాపు వెయ్యి రకాలు ఉన్నాయని అంతర్జాతీయ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ఒకటి ఇటీవల వెల్లడించింది. వీటిలో కాల్షియం, జింక్, ఒమెగా-3, ఫ్యాటీ ఆసిడ్స్, తక్కువ కొలస్ట్రాల్ లాంటి పోషక విలువలు దండిగా ఉన్నాయని తెలిపింది. 150 గ్రాముల బీఫ్ బర్గర్ తయారు కావాలంటే (గోవు తాగే నీటితో సహా) దాదాపు 3,290 లీటర్ల నీరు అవసరమని, అదే పరిణామంగల క్రిమికీటకాల బర్గర్‌ను తయారు చేయాలంటే మగ్గు నీళ్లు సరిపోతాయని స్వయంగా సైంటిస్ట్ అయిన సారా బెనన్ తెలియజేస్తున్నారు.
2050 సంవత్సరం నాటికి మానవుల అవసరాలకు ప్రస్తుతంకన్నా 70 శాతం అధిక ఆహారం, 120 శాతం అధిక నీరు, 42 శాతం అధిక వ్యవసాయ భూమి అవసరమన్నది ఓ అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆహారంగా క్రిమికీటకాలను తీసుకున్నట్లయితే ప్రపంచ పర్యవరణానికి ఎంతో దోహదం చేసినవారమవుతామని సారా వాదిస్తున్నారు. క్రిమికీటకాలను పెంచడానికి తక్కువ స్థలం, తక్కువ నీరు సరిపోతాయని ఆమె అంటున్నారు. ప్రస్తుతం ఆమె వంద ఎకరాల్లో బగ్ ఫామ్ నడుపుతున్నారు. ఆ ఫామ్ నిర్వహించడానికి కూడా బ్రిటిష్ ప్రభుత్వం అనేక షరతులను పెట్టింది. మానవులు ఆహారంగా తీసుకునే ఏ మొక్కలు, పండ్లను, పురుగుల పెంపకానికి ఉపయోగించరాదన్నది అందులో ప్రధానమైన షరతు. తాము ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త హోటల్‌కు తగిన ప్రచారం లభిస్తే ‘వివాహ భోజనంబు, వింతైన వంటకంబు’ అంటూ లొట్టలేస్తూ కస్టమర్లు ఎగబడడం ఖాయమని సారా అంటున్నారు.