అఫిలియేషన్పై నేడు హైకోర్టు తీర్పు
ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీ నివేదికలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ వ్యవహారంలో మంగళవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకు ఆయా కాలేజీల్లో ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో కూడిన బృందాలు తనిఖీలు పూర్తి చేసిన నేపథ్యంలో, అఫిలియేషన్పై నిర్ణయం ఎవరు తీసుకోవాలన్న దానిపై తాము స్పష్టతనిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, అఫిలియేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలంటూ ఏఐసీటీఈ, జేఎన్టీయూ ప్రతినిధులతో 25 బృందాలను ఏర్పాటు చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో సోమవారం జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి, ఎ.అభిషేక్రెడ్డిలు ఈ కేసు గురించి ప్రస్తావించారు. తనిఖీ బృందాలు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి, వాటిలో సౌకర్యాలపై నివేదికలు తయారు చేశాయని తెలిపారు. హైకోర్టును ఆశ్రయించిన 122 కాలేజీల్లో 23 కాలేజీలు తనిఖీలకు ముందే తమకు అసలు అఫిలియేషన్ అవసరం లేదని చెప్పాయని, మిగిలిన 99 కాలేజీల్లో అత్యధిక శాతం కాలేజీలు ఒకటి, రెండు కోర్సులకే అఫిలియేషన్ చాలని చెప్పాయని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
తనిఖీల నివేదికలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అఫిలియేషన్ ఇచ్చే విషయంలో అటు ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోవాలా..? లేక జేఎన్టీయూ నిర్ణయం తీసుకోవాలా..? అన్న సందిగ్థత ఉందని, అందువల్ల ఈ విషయంలో స్పష్టతనివ్వాలని వారు కోర్టును కోరారు. ధర్మాసనం ఆదేశాల మేరకు తనిఖీ బృందాల నివేదికలను సీల్డ్ కవర్లలో ఉంచి హైకోర్టు రిజిష్టర్ ముందుంచామని తెలిపారు.