కరువు నిజమే..
కడప సెవెన్ రోడ్స్ : వైఎస్ఆర్ జిల్లాలో తీవ్ర కరువు నెలకొందని, పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తామని బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర కరువు పరిశీలక బృంద సభ్యులు తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ డెరైక్టర్ వందనా సింగాల్, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖకు చెందిన వాటర్ క్వాలిటీ స్పెషలిస్టు డాక్టర్ బ్రజేష్ శ్రీ వాత్సవ, నీతి అయోగ్ సీనియర్ రీసెర్చి ఆఫీసర్ డాక్టర్ రామానంద్‌లతో కూడిన కేంద్ర కరువు పరిశీలక బృందం బుధవారం సాయంత్రం కడప నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకుంది. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సభ్యులు తిలకించారు. ఖరీఫ్, రబీ మొత్తం కలిపి ఈ ఏడాది సాధారణం కంటే 52.5 శాతం వర్షపాతం తగ్గిందని కలెక్టర్ కేవీ రమణ వారికి వివరించారు.
సాధారణ సాగు విస్తీర్ణం కూడా బాగా పడిపోయిందని చెప్పారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, కంది, వరి, శనగ దిగుబడులు దారుణంగా పడిపోయాయని తెలిపారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని చెప్పారు. పలు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని చోట్ల వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ఉపాధి పనులను చేపట్టడం ద్వారా వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరువు బృందం వెంట ఉన్నారు.
కాగా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య.. జిల్లాలో నెలకొన్న కరువు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై కేంద్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఇక్కడి కరువు తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యత అని కరువు పరిశీలక బృందం సభ్యులు స్పష్టం చేశారు. అనంతరం వారు రామాపురం, లక్కిరెడ్డి పల్లె మండలాల్లో పర్యటించారు.
సహాయక చర్యలు చేపట్టాలి : సీపీఐ
జిల్లా అంతటా కరువు నెలకొన్నందున యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, ఆ పార్టీ అనుబంధ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామసుబ్బారెడ్డి, జి.చంద్రలు కోరారు. గ్రామాల్లో కొత్త బోర్లు వేయడంతోపాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల ద్వారా నీరందించాలన్నారు. ఖరీఫ్ మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో గ్రామీణ ఉపాధి హామి పనులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలన్నారు.
జిల్లాకు సరిపడ పశుగ్రాసాన్ని ఉచితంగా అందించి ఆదుకోవాలని కోరారు. రైతులు, వృద్ధులకు కరువు భత్యాన్ని చెల్లించాలని, 35 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. నిబంధనలతో సంబంధం లేకుండా మామిడి, బొప్పాయి, అరటి, చీని, సపోట, జామ, దానిమ్మ తదితర పండ్ల తోటలకు వంద శాతం పంటల బీమా చెల్లించాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రాతిపదికన కరువు నిధులను దళితవాడల్లోనే ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, సుబ్బరాయుడు, శివ, గంగా సురేష్ పాల్గొన్నారు.