నేనే వస్తున్నా.. మీ తాట తీస్తా ..!
ఎవరు అడ్డుకుంటారో చూస్తా
కబ్జా భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు
కేయూ ఇన్స్పెక్టర్గా వివాదాస్పద పోలీస్ అధికారి
డీజీపీ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు
యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆందోళన
హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీ ఇన్స్పెక్టర్గా వచ్చేందుకు ఓ వివాదాస్పద సీఐ పైరవీలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి తెరవెనుక జరగాల్సిన తతంగం అంతా పూర్తయింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడునున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా తానే కాకతీయ యూనివర్సిటీ సీఐగా వస్తున్నట్లు ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విధుల్లో చేరిన వెంటనే ఇన్నాళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పనిపడుతానంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లుగా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
స్థలం కోసమే.. స్థాన చలనం..
ప్రస్తుతం బదిలీపై వస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ఓ సీఐ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పలివేల్పులంలో 800 గజాల స్థలాన్ని ఎనిమిదేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ స్థలం కాకతీయ యూనివర్సిటీకి చెందినట్లుగా విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం ఇరువురి మధ్య నలుగుతోంది. ప్రస్తుత జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ వివాదాస్పద స్థలాన్ని సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించారు. ఆమె జేసీగా ఉన్నంత కాలం ఈ భూముల జోలికి ఎవరూ రాలేదు. ఆమె ఎప్పుడైతే బదిలీ అయ్యారో.. కాకతీయ యూనివర్సిటీ భూముల వ్యవహారం మళ్లీ తెరమీదికి వచ్చింది. సర్వేల పేరుతో సీఐ, విద్యార్థి సంఘాలు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభమైంది. సర్వే నివేదిక ఉండగా మళ్లీ సర్వే చేయడమేమిటని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అవసరమైతే ఏడీ వచ్చి సర్వే చేయాలని వారు పట్టుపట్టారు.
మధ్యలో ప్రైవేట్ భూమా ?
కాకతీయ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించింది. పలివేల్పుల శివారులోని 412, 413 సర్వే నంబర్లలో రైతుల నుంచి భూములను కొనుగోలు చేసింది. ఇందులో 412 సర్వే నంబర్లో 36 గుంటలు, 413 సర్వేలో 3.09 గుంటలు సేకరించింది. అయితే సదరు సీఐ పక్కనే ఉన్న సర్వే నంబరు 414లో 800 గజాల భూమి కొనుగో లు చేశాడు. నిర్మాణం మాత్రం 413లో చేయడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
సీఐ పవర్..
ఓ వైపు విద్యార్థి సంఘాలు కాకతీయ యూనివర్సిటీ భూమిని కాపాడాలని ఆందోళన చేస్తుండగానే.. మరోవైపు ఆ సీఐ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాడు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ అధికారులు, కలెక్టర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం సర్వే అధికారులు మరోసారి భూములను సర్వే నిర్వహించారు. ఈ సమయంలో తాను నిర్మాణం చేపట్టదలిచిన భూమిని ప్రైవేట్ భూమిగా చూపించాలని సర్వే అధికారులపై సదరు సీఐ నలువైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చారు. ఎలాగైనా ఆ భూమిని చేజిక్కుంచుకోవాలని ఎత్తులు వేశారు. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఆ యత్నం విఫలమైంది.
భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నం..
ఆ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ సీఐగా వస్తే తప్ప రూ.80 లక్షల విలువైన భూమికి సంబంధించిన వివాదం పరిష్కారం కాదనే నిర్ణయానికి సదరు సీఐ వచ్చారు. దీంతో సహచరుల సలహా మేరకు ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రాష్ర్టస్థాయి పోలీస్అధికారుల దగ్గర తన పలుకుబడిని ఉపయోగిస్తున్నాడు. చివరికి పై స్థాయి పోలీసు అధికారులు కూడా ఆయన పేరును కేయూ సీఐ పోస్టుకు సిఫార్సు చేశారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. భూ ఆక్రమణకు పాల్పడే సీఐను శాంతిభద్రతల సీఐగా బదిలీ చేస్తే పరిణామాలు మరోలా ఉంటాయని విద్యార్థిసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాకతీయ వర్సిటీ భూములు, సీఐ వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పరిస్థితి వివరించడానికి విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటికీ సంబంధించి భూముల రికార్డులు, మ్యాప్లు తదితర ఆధారాలను సేకరించారు. అపాయింట్మెంట్ తీసుకుని త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని విద్యార్థి సంఘాల నాయకుడొకరు తెలిపారు.