ఇద్దరు బాలనేరస్తుల అరెస్ట్
రూ.3.21 లక్షల సొత్తు స్వాధీనం
నెల్లూరు (క్రైమ్) : ఇళ్లల్లో, వాహనాలు చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు బాలనేరస్తులను శుక్రవారం ఐదో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.21 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని సీఆర్పీ డొంక మసీదు సమీపంలో నివసిస్తున్న ఓ బాలుడు సౌత్రాజుపాళెంకు చెందిన మరో బాలుడు స్నేహితులు. వీరిద్దరు వ్యసనాలకు బానిసై చోరీల బాట బట్టారు. నిందితులు తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడటంతో పాటు ఆరు బయట ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించారు.
వారిపై ఐదో నగర పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం నిందితులు అయ్యప్పగుడి సమీపంలో ఉండగా ఐదో నగర ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ జగత్సింగ్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. లక్ష విలువ చేసే బంగారు ఆభరణా లు, రూ.1.50 లక్షల విలువ చేసే అల్యూమినియం వస్తువులు, హోండాషైన్, సూపర్స్ల్పెండర్బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 3.21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇది ఇలా ఉంటే మరో మూడు బైక్‌లు అనామత్తుగా దొరికాయని వాటి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.