త్రీస్టార్ ఎవరిదో..?
జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ల వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారా? వారి దిన చర్య, కదలికలపై ఎప్పుటికప్పుడు ఆరా తీస్తున్నారా? కొందరు సీఐలు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి పోలీస్ స్టేషన్లను రచ్చబండల్లా మార్చేశారా? వారి వల్లే సీఐలకు చెడ్డపేరు వస్తోందా? దీనిపై ఇంటలిజెన్స్ వర్గాలు లోతుగా దర్యాప్తు చేసి, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారా అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో సీఐల భారీ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆదాయం తెచ్చిపెట్టే సర్కిళ్లలో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు అధికార పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే సమాచారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
- అనంతపురం క్రైం
జిల్లాలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
♦ సీఐల పని తీరుపై ఉన్నతాధికారుల ప్రత్యేక దృష్టి
♦ సీఐల వ్యవహార శైలిపై ప్రభుత్వానికి నివేదించిన ఇంటలిజెన్స్ విభాగం
♦ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ సీఐల ప్రదక్షిణలు
♦ ఆదాయ సర్కిళ్లలో స్థానం కోసం ప్రయత్నాలు
జిల్లాలో ఏ పోలీస్ సర్కిల్ గానీ, ఏ పోలీస్ స్టేషన్లో చూ సినా ఇప్పుడు ఒకటే చర్చ. మన సీఐకి బదిలీ తప్పదం టా అంటూ. అయ్యపై అనేక ఫిర్యాదులు ఉన్నాయం ట.. ఆయనపై బదిలీ వేటు పడుతుందంట.. కొత్త సీఐ ఎవరొస్తారో ఏమో?నంటూ ఏ ఇద్దరు ఖాకీలు కలిసినా ఒకటే ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తం గా 35 మంది సీఐలపై బదిలీ జాబితా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పలు కేసుల్లో పంచాయితీలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా వీరిపై బదిలీ వేటు పడనుందని తెలుస్తోంది. కొందరు సీఐలు తాము బదిలీ కాకుండా ఉన్న చోటే కొనసాగేలా హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీఐల దినచర్యపై నిఘా
సీఐలు కొందరు ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి దిన చర్యపై శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీలు కాస్త ఆలస్యమైనా భారీ స్థాయిలో బదిలీలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని సీఐలను వాడుకుంటూ పోలీస్ స్టేషన్లను పంచాయితీలకు అడ్డాగా మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇప్పటికే అనంతపురం సహా జిల్లాలోని పలువురు సీఐలపై పూర్తి స్థాయి నివేదికను ఇంటలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. కొందరు సీఐల ప్రవర్తనతో పోలీసు ఉన్నతాధికారులకు చెడ్డపేరు రాగా, అటువంటి వారిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు సీఐలను పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకురావడాన్ని పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మెప్పుకోసం.. వారి ఆశీస్సుల కోసం.. కొందరు సీఐలు తమ పరిధి దాటి పని చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
నివేదికలో మార్పులు
ఇప్పటికే సీఐల బదిలీల జాబితా సిద్ధమైపోగా, కొందరు సీఐలు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో నివేదికలో కొంత మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీఐల బదిలీలు ఉంటాయని బాగా చర్చ జరిగినా, కొన్ని కారణాలతో ఈ నెలాఖరులో గానీ, లేదా మార్చి మొదటి వారంలో గానీ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.