మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!
నాకు చిన్నప్పటి నుండి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాటల్లో నేను ఎక్కువగా విన్న పాట శ్రీకారం (1996)లో ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’. మానవీయ కోణంలో, బతుకుపట్ల భరోసా ఇచ్చి, ఆశావాదం నింపే పాటలను రాయడంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి పాటలను చూసే నేను ఆయనను గురువుగా భావిస్తాను.
యువతరానికి ఒక సందేశాన్ని, సందేశంలా కాకుండా ఎలా చెబితే యువతరం వెంటనే స్పందిస్తుందో మనసుకు తాకే సరళమైన పదాలతో రాయడం ఆయన శైలి.
ఈ మధ్య యువతరంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం వల్ల ప్రతి చిన్న విషయానికి నీరసించి నీరుగారడం కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల వలనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ అత్యాచారానికి గురై, మానసిక వేదనకు లోనవుతుంది. ‘ఇక నాకు చావే శరణ్యం’ అనుకొని ఆత్మహత్య చేసుకోబోయే తరుణంలో హీరో ఆమెను ఓదారుస్తూ, ధైర్యం నింపి బతుకుమీద ఆశ కలిగేటట్లు చేస్తాడు. ఆ సందర్భంలో వచ్చిన పాటే ఇది.
మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు/ కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు/ ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది/ వేటాడు వేళతో పోరాడమన్నది... అనే పల్లవిలో మొదటి వాక్యమే అద్భుతమైన స్టేట్ మెంట్. మనసుకు బాధగా ఉందని, ఇక మరణం ఒకటే దారి అనుకొని వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ పాట వినాలి. నీ కన్నీళ్లను తుడిచేవారు ఏ ఒక్కరూ లేరని చితిమంటలకు స్వాగతం పలకకూడదు. నిండుగా నూరేళ్లు సంతోషంగా జీవించాలి. జీవించినంత కాలం ఎటువంటి సమస్యలు వచ్చినా, కాలానికి ఎదురెళ్లి పోరాడి కాలాతీతవ్యక్తులుగా నిలిచిపోవాలి. అప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది.
కలసి రాని కాలమెంత కాటేస్తున్నా చలి చిదిమేస్తున్నా/ కూలిపోదు వేరు ఉన్న తరువేదైనా తనువే మోడైనా/ మాను జన్మకన్న మనిషి ఎంత మిన్న/ ఊపిరిని పోసే ఆడదానివమ్మా/ బేలవై నువ్వు కూలితే నేలపై ప్రాణముండదమ్మా... అనే మొదటి చరణంలో ఆరారు కాలాలు రకరకాలు ఋతువులు మారుతున్నా, చచ్చేంత చలి చిదిమేస్తున్నా మోడైన చెట్టు తనకు తాను కూలిపోదు. ఆ చెట్టు కంటే గొప్ప బతుకు మనిషిదే కదా! ఈ లోకమనే మహావృక్షానికి తల్లి వేరువు నువ్వు... నువ్వే కూలిపోతే భూమ్మీద ప్రాణి అనేదే ఉండదు. జీవరాశికి పుట్టుకకు కారణమైన ఆడదానివి నువ్వు... నువ్వే చావును ఆశ్రయిస్తే అది ఎంతవరకు సమంజసం.
ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు పరిమార్చవే కీడు/ కాళివైతే కాలి కింద అణుగును చూడు నిను అణిచేవాడు/ మృత్యువును మించే హాని ఎక్కడుంది/ ఎంత గాయమైనా మాని తీరుతుంది/ అందుకే పద ముందుకే లోకమే రాదా నీ వెనకే... అనే రెండవ చరణంలో నీ ఆయుష్షునీ చావులా కాకుండా ఆయుధంగా మార్చుకుంటే ఏ కీడు దరిజేరదు. నువు కాళికవై పోరాడితే నిను అణిచేవాడు ఎప్పటికీ నీ కాలి కిందే ఉంటాడు.
సృష్టిలో మనిషికి హానికారమైనది మరణమొక్కటే దాని ముందు ఎంతగాయమైనా చిన్నదే కదా! ఏదో ఒకరోజు మానుతుంది కదా అందుకే ఎటువంటి ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తే అది ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. నిన్ను చూసి ఈ లోకం గర్విస్తుంది.
జీవితంలో ఓడిపోయానని, సమస్యలు చుట్టుముట్టాయని ఆత్మహత్యకు పాల్పడేవారికి ఈ పాట ఒక మేలుకొలుపు. ఈ పాట వింటే ఆత్మహత్యలు ఆగిపోతాయని నా నమ్మకం. ఈ పాటకు ఇళయరాజా బాణీ, జేసుదాస్ స్వరం మరింత బలం చేకూర్చాయనడంలో అతిశయోక్తి లేదు.
- సంభాషణ: నాగేశ్