పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు
ఏలూరు సిటీ : జిల్లాలో పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారని ఏపీ రాజీవ్ విద్యామిషన్ ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్ పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సమాఖ్య జిల్లా శాఖ అధ్యక్షుడు వీర్ల శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. వారంతా ఈనెల 31లోగా రాజీవ్ విద్యామిషన్ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో ఈ పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లు యథావిధిగా కొనసాగేందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లోని ఒక సభ్యుడు నుంచి పనితీరు సం తృప్తికరంగా ఉందనే సర్టిఫికెట్ తీసుకుని దరఖాస్తుతో జతచేయాలని సూచించారు.
ఇప్పటికే పనిచేస్తున్న వారికి వయోపరిమితి లేదని, కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులకైతే ఓసీలకు 39 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 44 సంవత్సరాలు, వికలాంగులకు 49 సంవత్సరాలు పరిమితి ఉందని తెలిపారు. ఆర్ట్ ఎడ్యుకేషన్‌లో 179, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 22, వర్క్ ఎడ్యుకేషన్‌లో 202 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. నెలకు రూ.6 వేల గౌరవవేతనం ఇస్తారని తెలిపారు. దరఖాస్తులు స్కూల్ ప్రధానోపాధ్యాయుల వద్ద లభిస్తాయని పేర్కొన్నారు.