పైసలివ్వకుంటే.. ఫెయిలే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రభుత్వ ఐటీఐలో పైసా ఖర్చు లేకుండా రెండేళ్లు కోర్సు పూర్తిచేస్తే ఉ ద్యోగం వస్తుందన్న ఆశపడే పేద విద్యార్థులను దురాశాపరులు సొమ్ముల కో సం పీడిస్తున్నారు. కాకినాడలోని ప్రభు త్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఐటీఐలో రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్లలో కొందరు చేస్తున్న దందాపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీఐ రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 15న థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుమా రు 238 మంది ఇన్‌స్ట్రమెంటల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి పది ట్రేడుల్లో పరీక్షలు రాస్తున్నారు. ఏటా ఈ పరీక్షల సమయంలో కొందరు ఇన్స్ట్రక్టర్లు సొమ్ములు గుంజడం ఆనవాయితీగా మారిందని, ఈ ఏడాది కూడా ఒక్కో పేపర్‌కు రూ.2000 వంతున వసూలు చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలకు వారం ముందు నుంచే..
పరీక్షలు మొదలు కావడానికి వారం ముందుగానే కొందరు ఇన్స్ట్రక్టర్లు వసూళ్ల బాధ్యతను తమకు అనుకూలురైన కొందరు విద్యార్థులకు అప్పగిం చారు. అక్రమ వసూళ్ల లక్ష్యం రూ.20 లక్షల పైమాటే. రెండో సంవత్సరంలో ఒక్కో విద్యార్థీ రెండు థియరీ, రెండు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలి. పేపర్‌కు రూ.2000 వంతున నాలుగింటికి రూ.8000 వసూలు చేశారని తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు. ఈ ఐటీఐలో చదువుతున్న వారంతా పేదకుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులే. 100 మార్కులున్న థియరీ పేపర్‌కు 40 పాస్ మార్కులు. మిగిలిన మూడు పేపర్లు ఒక్కొక్కటి 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక్కో పేపర్‌కు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్టే. ఇవి కాక ప్రాక్టికల్స్‌లో 300 మార్కులకు 180 వస్తే ఉత్తీర్ణులైనట్టే. విద్యార్థులు అభ్యసించేది ఏ ట్రేడ్ అయినా ఉత్తీర్ణతా మార్కులు మాత్రం మారవు. ఇన్స్ట్రక్టర్లు ఎక్కడ ఉత్తీర్ణతకు అడ్డుపడతారోనని అప్పులు చేసి అడిగినంతా సమర్పించుకున్నామని పేర్లు చెప్పడానికి భయపడుతున్న కొందరు తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపా రు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులోనైనా ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందన్న ఆశతోనే ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు.
వసూళ్లు వాస్తవమైతే చర్యలు : ప్రిన్సిపాల్
వసూళ్ల విషయమై ఐటీఐ ప్రిన్సిపాల్ డి.భూషణంను వివరణ కోరగా విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. బ లవంతపు వసూళ్లపై విద్యార్థులు ఫి ర్యాదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిం చగా.. విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటామన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
ఐటీఐ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.