విషమ‘పరీక్ష’
ఖమ్మం, న్యూస్‌లైన్ : ఇంటర్ మీడియెట్ పరీక్షలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు విషమ పరీక్షగా మారాయి. పరీక్ష కేంద్రాల వద్ద అరకొర వసతులు, విద్యుత్ కోతలతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. చీకటి గదులు, రేకుల షెడ్లలో పరీక్ష రాయాల్సి వచ్చింది. పలు సెంటర్లలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెట్టడంతో వారు ఇబ్బం ది పడ్డారు. బల్లలు, టేబుళ్లు లేక ఒడిలో ప్యాడ్ పెట్టుకొని పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనికి తోడు పలు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మారిన నిబంధనలకు అనుగుణంగా ఉదయాన్నే పరీక్షా కేంద్రాలు తెరవకపోవడంతో విద్యార్థులు, వెంట వచ్చిన తల్లిదండ్రులు, అధ్యాపకులు రోడ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,164 మంది గైర్హాజరయ్యారు.
అరకొర వసతులతో ఇక్కట్లు..
పరీక్షల నిర్వహణపై అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో పలు సెంటర్లలో కనీస వసతులు కల్పించలేదు. ఎర్రుపాలెం గురుకుల పాఠశాల కేంద్రంలో బెంచీలు, కుర్చీలు వేయకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్షలు రాస్తూ ఇబ్బంది పడ్డారు. ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలోని గదుల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఉక్కపోతతోనే పరీక్ష రాశారు. మూత్రశాలలు అద్వానంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాధన జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలోనూ ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోత మధ్యే పరీక్షలు రాయాల్సి వచ్చింది.
బయ్యారంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవటంతో వరండాలో కుర్చీల మీద కూర్చొని పరీక్ష రాశారు. కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్ర ంలో డెస్క్ బల్లలు లేవు. ఉన్న కొన్ని కూడా పొడవు తక్కువగా ఉండటంతో బల్లకు ఇద్దరు చొప్పున కూర్చోబెట్టడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఇదే కేంద్రంలో మరుగుదొడ్లు లేక అమ్మాయిలు అవస్థలు ఎదుర్కొన్నారు. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో సరిపడా టేబుళ్లు లేక ప్యాడ్లు ఒడిలోనే పెట్టుకుని రాయాల్సి వచ్చింది. జూలూరుపాడులోని ఓ ప్రైవేట్ క ళాశాలలో రేకుల షెడ్డులోనే పరీక్ష నిర్వహించారు.
కేంద్రాల వద్ద నిరీక్షణ...
మారిన నిబంధనల ప్రకారం సకాలంలో పరీక్ష కేంద్రాలు తెరవకపోవడంతో విద్యార్థులు, వెంట వచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8:30 నిమిషాలకే పరీక్ష కేంద్రంలోకి రావాలని, 8:45 నిమిషాలు దాటితే అనుమతించేది లేదని నిబంధన పెట్టారు. అయితే దీనికి అనుగుణంగా కనీసం అర్ధగంట ముందు పరీక్షా కేంద్రాలను తెరవాలనే ఆదేశాలు జారీ చేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చిన వారు కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంటే పరీక్ష కేంద్రాలు ఉండడం, వందలాది మంది విద్యార్థులు కేంద్రాల ఎదుట గుమిగూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఖమ్మంలోని శాంతినగర్ జూనియర్ కళాశాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అటుగా వచ్చిన ఆర్ఐవో విశ్వేశ్వర్రావుతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన ఆర్ఐవో గురువారం నుంచి ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలు తెరిచేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడంతో శాంతించారు.
ప్రశ్నపత్రాల్లో తప్పులతో విద్యార్థుల తికమక..
పలు ప్రశ్నలు తప్పుగా ప్రింట్ కావడం, తప్పుడు ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు తికమక పడ్డారు. సంస్కృతం కొత్త సిలబస్‌లో నాలుగో ప్రశ్న, ఉర్దూ కొత్త సిలబస్‌లో 14వ ప్రశ్నలోని 5 బిట్, హిందీ పాత సిలబస్ 6వ ప్రశ్న(డి), తెలుగులో నాలుగో విభాగంలో రెండవ ప్రశ్నలలో తప్పులు దొర్లాయని, తాము చదివింది ఒక తీరుగా ఉంటే ప్రశ్నపత్రంలో మరోతీరుగా ఉందని విద్యార్థులు వాపోయా రు. దీంతో ప్రశ్నలకు సమాధానం రాయాలో..? వద్దో..? అర్థం కాక తికమకపడ్డారు.
4,163 మంది గైర్హాజరు...
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మొదటి రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 4,163 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐవో విశ్వేశ్వర్రావు తెలిపారు.
జనరల్ విభాగంలో 26,343 మందికి గాను 23,981 మంది హాజరు కాగా, 2,362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 3,214 మందికి 2,412 హాజరు కాగా, 802 మంది గైర్హాజరయ్యారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమంతించేది లేదనే నిబంధనలు ఉండటంతో పలువురు విద్యార్థులు సకాలంలో హాజరు కాలేక పోయారు. ఉదాహరణకు భద్రాచలంలోని ఏపీఆర్ఎస్ బాలికల కేంద్రంలో ఓ విద్యార్థి 4 నిమిషాలు ఆలస్యంగా రాగా, ఆ విద్యార్థిని అనుమతించలేదు.
ఇలా పలువురు గైర్హాజరు కావాల్సి వచ్చింది. ఉదయం 8:45 - 8:59 నిమిషాల మధ్య వచ్చిన పలువురు విద్యార్థులతో ఆలస్యానికి కారణం తెలుపుతూ ధ్రువీకరణ పత్రం రాయించుకొని పరీక్షకు అనుమతించారు.