జాతీయ గీతానికి ఎమ్మెల్యే అవమానం
ఆమె సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ జాతీయగీతం వస్తున్న సమయంలో ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు దొరికేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని హౌరాలో చోటుచేసుకుంది. వైశాలి దాల్మియా టీఎంసీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హౌరాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. అయితే అక్కడ జాతీయ గీతం ఆలపిస్తుండగా.. సెల్ఫోన్లో మాట్లాడుతూ కెమెరాకు దొరికేశారు. అంతలో కెమెరాలు అన్నీ తనవైపే తిరగడాన్ని గమనించి.. వెంటనే కాల్ కట్ చేశారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన పలువురు పోలీసు అధికారులు, ఇతరులు అంతా గుండెల మీద చేతులు పెట్టుకుని గట్టిగా జాతీయ గీతం ఆలపిస్తూ కనిపించారు.
జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం, జాతీయ గీతం వస్తున్నప్పుడు దాన్ని డిస్ట్రబ్ చేసేలా ఎవరైనా ప్రవర్తిస్తే, వారిని జైలుకు పంపొచ్చు. మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో కూడా తప్పనిసరిగా జాతీయ గీతం ఆలపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా కూడా తప్పనిసరిగా నిలబడి ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కేరళలో ఓ సినిమా ప్రదర్శన సందర్భంగా ఇలా నిలబడనందుకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళకు చెందిన 12 మంది ప్రతినిధులను అరెస్టు చేశారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.