ఆన్లైన్ బీమా.. ఆరిందాల మేలు..
ఇంటర్నెట్ మాధ్యమంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఆన్లైన్లో విమానం టికెట్లు, పుస్తకాలు షాపింగ్ చేసినంత సులువుగా పాలసీ కొనుగోలు ప్రక్రియ కూడా ఉండే విధంగా బీమా కంపెనీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఇమిడి ఉన్న ప్రయోజనాల గురించి వివరించేదే ఈ కథనం.
సౌకర్యవంతం, పారదర్శకం: ఆన్లైన్ ప్రత్యేకత ఏమిటంటే .. పాలసీని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు దరఖాస్తు నింపి సమర్పించవచ్చు. ఉదాహరణకు సమయాభావం వల్ల కావొచ్చు లేదా ఏదైనా కారణం వల్ల కావొచ్చు మీరు సగంలోనే ఆపేసిన పక్షంలో మళ్లీ తర్వాతెప్పుడైనా మిగతాది నింపి దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం దరఖాస్తు ఎక్కడిదాకా నింపినది.. బీమా కంపెనీ సదరు ఫారం యూఆర్ఎల్ను మీకు అప్పటికప్పుడు ఈమెయిల్ కూడా చేస్తుంది. కంపెనీ సేల్స్ సిబ్బంది మీకు ఫోన్ చేసి మరీ దరఖాస్తు నింపడంలో సహాయం చేస్తారు. లేదా మీరే కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసినా.. సిబ్బంది సహకరిస్తారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రతి దశలోనూ మీకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందుతాయి. పాలసీ తీసుకునే ముందు మీకేమైనా సందేహాలుంటే తీర్చేందుకు కంపెనీ వెబ్సైట్లో ప్రత్యేక సెక్షన్ ఒకటి ఉంటుంది. ధుృవీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ అయినా చేయొచ్చు లేదా కొరియర్ చేయొచ్చు. మీరు ఎంచుకున్న లైఫ్ కవరేజీని బట్టి వైద్య పరీక్షల అవసరం గురించి కంపెనీయే మీకు తెలియజేస్తుంది.
సురక్షితం: ఆన్లైన్లో పాలసీ తీసుకోవడమనేది ఇతర ఈ-కామర్స్ లావాదేవీల తరహాలోనే చాలా సురక్షితమైనది. మీ క్రెడిట్/డెబిట్ కార్డు లేదా ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రీమియంను చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం పాలసీలకైతే.. కొన్ని సంస్థలు ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. ఇతరత్రా ఉత్తరప్రత్యుత్తరాలన్నీ కూడా కొరియర్లు, పోస్ట్ కన్నా వేగవంతంగా ఈమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ల రూపంలో జరిగిపోతాయి.
పాలసీ నిర్వహణ ఈజీ: కస్టమర్ల సందేహాలు అప్పటికప్పుడు తీర్చేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు బీమా కంపెనీల్లో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. సంస్థ వెబ్సైట్లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబరుతో పాటు, సంప్రదించాల్సిన ఈమెయిల్ ఐడీలు కూడా ఉంటాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం.. కాల్ సెంటర్‌కి కస్టమర్ చేసిన ఫోన్ కాల్ రికార్డును.. పాలసీ వ్యవధి పూర్తయ్యే దాకా బీమా కంపెనీ అట్టే పెట్టి ఉంచాలి. ఇక, ఆన్లైన్లో తీసుకోవడం వల్ల పాలసీ నిర్వహణ సులభతరంగా ఉంటుంది. ప్రీమియం రసీదులు, రిమైండర్లు, పాలసీ స్టేట్మెంట్ మొదలైనవి ఠంచనుగా ఆన్లైన్లోనే వచ్చేస్తాయి.
క్లెయిమ్ ప్రక్రియ సులభతరం: డెత్ క్లెయిములు మొదలైన వాటి గురించి పాలసీదారు కుటుంబసభ్యులు కంపెనీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా కంపెనీకి తెలియజేయొచ్చు. క్లెయిముకు ఏమేం పత్రాలు అవసరమవుతాయన్నది వెబ్సైట్లోనే ఉంటాయి. వాటిని సరిగ్గా అందజేస్తే చాలు. అయితే, క్లెయిమ్ ప్రక్రియ సజావుగా జరగాలంటే.. పాలసీ తీసుకునే సమయంలోనే ఏ విషయాన్నీ దాచిపెట్టకుండా, పూర్తిగా వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలి. అప్పుడే క్లెయిమ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు.
చౌక: ఇతర మాధ్యమాలతో పోలిస్తే ఆన్లైన్ మాధ్యమంలో పంపిణీ వ్యయాలు, ఇతర ఖర్చుల భారం బీమా సంస్థకి తగ్గడం వల్ల ఆన్లైన్ పాలసీలు కాస్త చౌకగా లభిస్తాయి. ప్రస్తుతం తక్కువ ప్రీమియాలతో ఆకర్షణీయమైన పాలసీలను అందించేందుకు జీవిత బీమా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు పొగాకు వినియోగించని వారికి కంపెనీలు ప్రీమియం మరికాస్త తగ్గిస్తున్నాయి.
అవసరానికో పాలసీ: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పాలసీలను బీమా సంస్థలు ఆన్లైన్లో అందిస్తున్నాయి. సాధారణంగా టర్మ్ ప్లాన్లు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ.. పొదుపు, పెట్టుబడి, వైద్యం, రిటైర్మెంట్ వంటి ఇతరత్రా అవసరాలకు తగిన పాలసీలు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
ఇలా ఎంతో కీలకమైన బీమా ప్రయోజనాలను ఆన్లైన్ మాధ్యమం ద్వారా మరింత చేరువగా తెస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. షరా మామూలుగా.. పాలసీని తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. క్లెయిమ్‌లను సెటిల్ చేయడంలోను, సేవలు అందించడంలోనూ సంస్థ రికార్డు, కంపెనీ బ్రాండ్ నేమ్ మొదలైనవి చూసుకోవాలి.