ఎల్ఐసీ.. జీవన్ ఉమంగ్ పాలసీ
8 శాతం వార్షిక రాబడి ∙వందేళ్ల దాకా కవరేజి
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మంగళవారం కొత్తగా దీర్ఘకాలిక ఎండోమెంట్ ప్లాన్ ’జీవన్ ఉమంగ్’ ప్రవేశపెట్టింది. ఇటు ఇన్‌కం అటు బీమా రక్షణ పాలసీల మేళవింపుతో ఉండే ఈ ప్లాన్.. వందేళ్ల దాకా కవరేజి అందిస్తుంది. వార్షికంగా 8 శాతం మేర ఖచ్చితమైన రాబడి హామీతో ఈ పాలసీ లభిస్తుంది. పాలసీదారుకు ప్రీమియం చెల్లింపు వ్యవధి పూర్తయిన నాటి నుంచి తొంభై తొమ్మిదేళ్లS వయస్సు వచ్చే దాకా వార్షికంగా సర్వైవల్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక పాలసీ మెచ్యూరిటీ సమయంలో లేదా పాలసీదారు మరణించిన పక్షంలో ఏకమొత్తంగా సమ్ అష్యూర్డ్‌ను కంపెనీ చెల్లిస్తుంది.
బేసిక్ సమ్ అష్యూర్డ్, పెయిడప్ సమ్ అష్యూర్డ్‌లో వార్షికంగా 8 శాతం మేర సర్వైవల్ బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది. 90 రోజుల పిళ్లల నుంచి 55 ఏళ్ల దాకా వయస్సు గలవారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌కి ఎటువంటి పరిమితులు లేవు. ప్రీమియం చెల్లింపు వ్యవధులు 15, 20, 25, 30 ఏళ్లుగా ఉన్నాయి. మరోవైపు, పాలసీల సంఖ్యాపరంగా తమ మార్కెట్ వాటా 76.09 శాతంగా ఉందని ఎల్ఐసీ వెల్లడించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రీమియం వ్యాపార విభాగం 27.22 శాతం వృద్ధి చెందింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ ఇయర్ ప్రీమియం రూ. 98,000 కోట్ల నుంచి రూ. 1.24 లక్షల కోట్లకు పెరిగింది.