గృహానికీ బీమా భరోసా
చాలా మందికి సొంత ఇంటి కొనుగోలు అనేది జీవిత కాల పెట్టుబడి. ఎందుకంటే ఇది ఆర్థికపరమైన భరోసాతో పాటు మానసికంగానూ కాస్త ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఎలాంటి ఉపద్రవాలొచ్చినా.. హాని కలగకుండా దీన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాం.. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు మొదలైన వాటి నుంచి ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు అత్యాధునిక తాళాలు, అగ్నిమాపక సాధనాలు లాంటివి ఉన్నప్పటికీ .. ఇవి నష్టాలను పూర్తిగా నివారించలేవు. భర్తీ చేయలేవు. కాబట్టే, పూర్తిగా రక్షణ కావాలంటే ..
ఇంటితో పాటు ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా వర్తించేలా గృహ బీమా పాలసీ తీసుకోవడం మంచిది. సమగ్రమైన హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న పక్షంలో నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవచ్చు. సాధారణంగా గృహ బీమా పాలసీలతో ఈ కింది అనూహ్య వైపరీత్యాల నుంచి ఇంటికి బీమా రక్షణ పొందవచ్చు.
* ఇంటిలోని విలువైన వస్తువులకూ ఇన్సూరెన్స్
* స్వల్ప ప్రీమియంలకు అధిక కవరేజీ
ప్రకృతి వైపరీత్యాలకు వర్తించే కవరేజీ
ఆయా ప్రాంతాలను బట్టి.. వరదలు, భూకంపాలు, తుపానుల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంటికి తీవ్ర నష్టాన్ని కలగజేయొచ్చు. వాతావరణం పెను మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో ఇలాంటి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయి. చెన్నై వరదలు, ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించేదిగా హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజీ ఉండాలి.
అగ్నిప్రమాదాలు..
చిన్న నిప్పు రవ్వ సైతం భారీ అగ్నిప్రమాదానికి .. ఫలితంగా నష్టాలకు దారితీయొచ్చు. హోమ్ ఇన్సూరెన్స్‌తో ఇంటితో పాటు ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.
అల్లర్లు.. టైజం..
ప్రకృతి వైపరీత్యాలను పక్కన పెడితే కొన్నాళ్ల క్రితం దాకా టైజం లాంటి విపత్తుల ఉదంతాలు కొంత తక్కువగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో అల్లర్లు, టైజం, దోపిడీలు, దొంగతనాల ఉదంతాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి నుంచి కూడా ఇంటికి రక్షణ కల్పించగలదు హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉంటున్న పక్షంలో గృహానికి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా.. ఇంట్లోని ఇతరత్రా విలువైన వస్తువుల కోసం బీమా పాలసీ తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఆభరణాలు లాంటివన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి.
ప్రస్తుతానికైతే.. హోమ్ ఇన్సూరెన్స్ ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అయితే, నివాసం ఉంటున్నది నగరంలోనైనా వేరే ఎక్కడైనా కూడా రిస్కులు తప్పని పరిస్థితి కాబట్టి.. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఈ పాలసీలకు కట్టాల్సిన ప్రీమియంలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఉదాహరణకు ఇల్లు, ఇంట్లోని విలువైన వస్తువులకు కూడా దాదాపు రూ. 5,00,000 సమ్ అష్యూర్డ్ మేర కవరేజీనిచ్చే పాలసీ.. అత్యంత తక్కువగా రూ. 1,500 స్థాయి ప్రీమియంకు కూడా లభ్యమవుతుంది. ఇంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీ లభిస్తున్నప్పటికీ .. హోమ్ ఇన్సూరెన్స్‌కి ఇంకా సరైనంత ప్రాచుర్యం లభించడం లేదు. చాలా మంది వేసుకునే ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగినంత చోటు దక్కడం లేదు.
పాలసీ ఎంచుకోవడమిలా..
హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ముందుగా కొన్ని అంశాలు సరిచూసుకోవాలి. మీ నివాసానికి ఎంత బీమా, ఏ రకమైన కవరేజీ అవసరమన్నది ఒకసారి లెక్కవేసుకోవాలి. దీర్ఘకాలానికి కవరేజీ ఎంచుకుంటే కట్టాల్సిన ప్రీమియంలలో ఒకోసారి 50 శాతం దాకా కూడా డిస్కౌంట్లు లభించవచ్చు. అలాగే ప్రతి సారీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సిన సమస్యా తప్పుతుంది.
- పునీత్ సాహ్ని, ప్రోడక్ట్ డెవలప్మెంట్ విభాగం హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్