ఎస్బీఐ.. ‘అనుబంధ బ్యాంకుల్లో’పీవో కొలువు కోసం..
చక్కటి పని వాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు పుష్కల అవకాశాలు.. బ్యాంకు ఉద్యోగాల పట్ల యువత ఆకర్షితులవుతుండటానికి కారణాలు. ప్రస్తుతం దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగం కేంద్ర ప్రభుత్వ విధానాల (జన్ ధన్ యోజన పథకం వంటివి)తో మరింత అభివృద్ధి సాధించే దిశగా కదులుతోంది. ఈ క్రమంలోనే తరచూ బ్యాంకు ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది.
అర్హత:
ఏదైనా గ్రూపులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులు.
వయసు:
2014, సెప్టెంబర్ 1 నాటికి కనీస వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఎస్సీ, ఎస్టీ-15 ఏళ్లు; ఓబీసీ-13 ఏళ్లు; జనరల్-పదేళ్లు) సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ ఆధారిత పరీక్ష, రెండో దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి.మొదటి దశ పరీక్ష విధానం: ఇందులో రెండు విభాగాలుంటాయి.
ఆబ్జెక్టివ్ టెస్ట్
200 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్లో జరుగుతుంది. సమయం రెండు గంటలు.ఇందులో నాలుగు సెక్షన్లుంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. అవి.. 1. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 2. జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్ 3. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ 4. రీజనింగ్ (ఉన్నత స్థాయి).
డిస్క్రిప్టివ్ టెస్ట్: 50 మార్కులకు ఉంటుంది. సమయం గంట. ప్రశ్నలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. సమాధానాలు పేపర్‌పై రాయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలపై ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. రెండో దశ: గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. మొదటి దశలో నిర్దేశ కటాఫ్ సాధించిన వారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు.తుది ఎంపిక: మొదటి దశ 250 మార్కులను 75 మార్కులకు, రెండో దశ 50 మార్కులను 25 మార్కులకు మారుస్తారు. మొత్తం వంద మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది జాబితా రూపొందిస్తారు.
ముఖ్య వివరాలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 1, 2014.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 18, 2014.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.500.
దరఖాస్తు ఫీజు చెల్లింపు (ఆన్లైన్):
సెప్టెంబర్ 1, 2014 - సెప్టెంబర్ 18, 2014.
దరఖాస్తు ఫీజు చెల్లింపు (ఆఫ్‌లైన్):
సెప్టెంబర్ 3, 2014-సెప్టెంబర్ 20, 2014.
హాల్ టికెట్ డౌన్లోడ్: 2014, అక్టోబర్ 24 తర్వాత
పరీక్ష తేదీ: 2014, నవంబర్‌లో.
వెబ్సైట్: www.statebankofindia.com;
www.sbi.co.in
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్
కరీంనగర్
ఖమ్మం, వరంగల్.
ప్రిపరేషన్
ఏ పోటీ పరీక్షకైనా వేగం, కచ్చితత్వం అనేవి రెండు చక్రాల వంటివి. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడే విజయం సొంతమవుతుంది.జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగం సులువే కానీ మాతృభాష కాని కారణంగా కష్టంగా అనిపిస్తుంది. ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులకు కూడా ఈ విభాగం మరీ సులువుగా అనిపించదు. ఇందులో వొకాబ్యులరీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. కొన్ని పదాలకు ఆంటోనిమ్స్, కొన్ని పదాలకు సినానిమ్స్ గుర్తించాలి. రోజూ కొన్ని కొత్త పదాలకు సమానార్థాలు, వ్యతిరేకార్థాలు నేర్చుకుంటే సమాధానాలు గుర్తించడం తేలికవుతుంది. ఇంగ్లిష్ వ్యాకరణంపైనా పట్టు సాధించాలి. ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విభజించి, ఏ భాగంలో తప్పు ఉందో కనుక్కోమనే ప్రశ్నలకు.. ఖాళీలు పూరించేందుకు వ్యాకరణ అభ్యసనం ఉపయోగపడుతుంది.
ఆర్టికల్స్, టెన్సెస్, డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తదితర అంశాలను నేర్చుకోవాలి. జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్: రోజూ దినపత్రికలు చదువుతూ, టీవీ వార్తలు వింటూ ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్ వంటి పేపర్లు; ఇతర దినపత్రికల్లోని బిజినెస్ పేజీలను చదవడం ద్వారా బ్యాంకింగ్ రంగ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వారు అందిస్తున్న డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్ ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి.
ఈ డిప్లొమా లేని వారు కనీసం సంబంధిత మెటీరియల్‌ను అయినా చదవాలి. కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. మార్కెటింగ్‌కు సంబంధించి మార్కెట్, అడ్వర్టైజింగ్, సేల్స్, ప్రొడక్షన్, కస్టమర్ పర్సెప్షన్ తదితర అంశాలను చదవాలి.డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్: సాధారణంగా ఈ విభాగం నుంచి 10-20 వరకు ప్రశ్నలు వస్తాయి. కానీ, ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల పీవో పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో దాదాపు పూర్తిగా డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్‌పై ప్రశ్నలుంటాయి. అందువల్ల టేబుల్స్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, డాటా సఫిసియెన్సీలపై పట్టు సాధించాలి. దీనికోసం శాతాలు, సరాసరి, నిష్పత్తులు తదితరాలను అభ్యసించాలి.
రీజనింగ్: ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్‌పై ఆధారపడిన ప్రశ్నలుంటాయి. సిరీస్,అనాలజీస్, క్లాసిఫికేషన్, స్టేట్మెంట్-ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్,సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్స్, సిల్లోజం తదితర అంశాలపై పట్టు సాధించాలి. లాజికల్ రీజనింగ్‌లో వెన్డయాగ్రమ్స్పై ఆధారపడిన ప్రశ్నలుంటాయి. తార్కికంగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సిన ప్రశ్నలూ ఉంటాయి. అందువల్ల సమాచారాన్ని విశ్లేషించి,వేగంగా సమాధానాలు గుర్తించే నేర్పును సొంతం చేసుకోవాలి.డిస్క్రిప్టివ్ టెస్ట్: ప్రశ్నలు కాంప్రెహెన్షన్, ప్రిసైస్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సేలపై ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థులు అందరికీ అర్థమయ్యే పదాలతో ఉత్తరాలు, వర్తమాన సంఘటనలపై ఎస్సేలు రాయడం సాధన చేయాలి.
కెరీర్ పీవో జీతభత్యాలు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటాయి. ముంబైలో అయితే రూ.65 వేల వరకు వస్తుంది. ఇతర మెట్రో నగరాల్లోనూ దాదాపు ఇంతే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.35 వేలు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వారికి వీటికి మధ్యస్థంగా ఉంటుంది. పీవో ఉద్యోగాన్ని జూనియర్ మేనేజ్‌మెంట్‌గా పరిగణిస్తారు. ప్రొబేషన్ పూర్తయ్యాక అసిస్టెంట్ మేనేజర్ హోదా ఇస్తారు. పదోన్నతి ద్వారా మిడిల్ మేనేజ్మెంట్ స్థాయికి ఎదుగుతారు. అక్కడ డిప్యూటీ మేనేజర్, మేనేజర్ అనే రెండు స్థాయిలుంటాయి. ఆ తర్వాత ప్రమోషన్ సీనియర్ మేనేజ్మెంట్ హోదా. అందులో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విభాగాలుంటాయి. వీటి తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ హోదాలు టాప్ ఎగ్జిక్యూటివ్ స్థాయికి చెందినవి. ఈ విధంగా స్కేల్ 1 నుంచి ఏడు వరకు వివిధ స్కేళ్లు ఉంటాయి. ఆ తర్వాత రెండు ప్రత్యేక స్కేళ్లుంటాయి. వీటిలో మొదటిది చీఫ్ జనరల్ మేనేజర్, రెండోది మేనేజింగ్ డెరైక్టర్. బ్యాంకుల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు గతంలో పీవోగా ఉద్యోగ జీవితం ప్రారంభించినవారే!
విన్నర్ వాయిస్
ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ సాధించాలంటే వొకాబ్యులరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దీనివల్ల ప్యాసేజ్‌ల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకునేందుకు, క్లోజ్ టెస్ట్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం తేలికవుతుంది. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. డేటా ఇంటర్ప్రెటేషన్లో ముఖ్యంగా టేబుల్, బార్, పై డయాగ్రమ్స్, పారాగ్రాఫ్ అనాలిసిస్ ప్రశ్నలు వస్తాయి. వీటికి త్వరగా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలంటే తొలుత ఇచ్చిన సమాచారాన్ని సులువుగా అర్థమయ్యేలా టేబుల్ రూపంలో మలచుకునే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రతి ప్రశ్నకు సంబంధించి చల రాశులు (ఠ్చిటజ్చీఛ్ఛట), యూనిట్లను పరిగణనలోకి తీసుకోవాలి. రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్స్, ఎన్కోడింగ్-డీకోడింగ్, సింబల్స్- నొటేషన్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్ అంశాలపై దృష్టిసారిస్తే తేలిగ్గానే కటాఫ్‌ను దాటొచ్చు. అభ్యర్థి తన భావాలను, పరిజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ఎలా వ్యక్తం చేస్తున్నాడో తెలుసుకోవడమే లక్ష్యంగా డిస్క్రిప్టివ్ పేపరు ఉంటుంది. ప్రతియోగితా దర్పణ్, ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు, జనరల్ అవేర్‌నెస్‌కు, ఇంగ్లిష్ విభాగాలకు ఉపయోగకరం. టైం పెట్టుకొని, వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి.
- జి.సాయి రమ్యశ్రీ,
ఎస్బీఐ పీవో విజేత (2013).