ఐఎస్‌డబ్ల్యూ, సీఐడీలకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో లూప్‌లైన్లుగా భావించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ), నేర పరిశోధన విభాగం(సీఐడీ)లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో గురువారం జరిగిన 15వ బ్యాచ్ పోలీసు జాగి లాల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘సీఐడీ, ఐఎస్‌డబ్ల్యూ సిబ్బందికి వారి జీతంలో 25 శాతం అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తాం.
‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల’లో పోలీసు సిబ్బందికి 10 శాతం కోటా ఇవ్వనున్నాం. ఐఐటీఏలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, విభాగాల జాగిలాలకూ శిక్షణ ఇస్తున్నారు. దీన్ని దేశంలోనే ఉత్తమ అకాడమీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది’ అని అన్నారు. ఐఐటీఏలో తమ జాగిలాలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర విభాగాలూ కోరటం గర్వించదగిన పరిణామమని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో నిఘా విభాగం చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఐఎస్‌డబ్ల్యూ ఐజీ మహేష్ మురళీధర్ భగవత్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన ఐఐటీఏ పరిపాలనా భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. కాగా వింగ్స్ వారీగా శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలాల హ్యాండ్లర్లకు హోం మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించారు.