సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు గల్లంతు
ఘట్కేసర్: మండలంలో సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) పత్రాలు గల్లంతయ్యాయి. మండలవ్యాప్తంగా 12 వేల మంది పింఛన్ కోసం దరఖాస్తుచేసుకోగా వాటిలో అధిక భాగం పరిశీలన పూర్తయింది. వీటిలో 1,158 సర్వే పత్రాలు మిస్సయినట్లు అధికారులు కనుగొన్నారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి పత్రాలను కంప్యూటర్లో ఫీడ్ చేయాలనే నిబంధన విధించడంతో పత్రాలు గల్లంతైన విషయం వెలుగుచూసింది. ఇప్పటివకూ మండలంలో అవుశాపూర్లో 187 మందికి, కొండాపూర్లో 132 మందికి మాత్రమే పింఛన్లు అందజేశారు.
మిగితా గ్రామాల్లో పింఛన్ల కోసం లబ్ధిదారులు ప్రతి రోజు పంచాయతీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లబ్ధిదారుల పేర్లు కంప్యూటర్లో ఫీడ్ కాలేదని, అందుకే ఆలస్యమవుతోందని అధికారుల నుంచి సమాధానం వస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు నిర్వహించడం, సర్వే పూర్తి కాగానే వాటిని కంప్యూటర్లో ఫీడ్ చేయించే పని వేగంగా చేయడం, అందుకు విద్యార్థులను ఉపయోగించడం, వారికి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే పత్రాలు గల్లంతై ఉండవచ్చని భావిస్తున్నారు.
సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు లేని కుటుంబాల నుంచి పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి విడతలో పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. వారిని రెండో విడతలో ఎంపిక చేసి అందజేస్తామంటున్నారు. దీంతో ఒక నెల పింఛన్ అందకుండా పోతుందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. తమకు మొదటి విడతలో పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా జాప్యం జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో పింఛన్లు పంపిణీ చేసే తేదీ ప్రకటిస్తామని అధికారులు అంటున్నారు.