వాట్సాప్ , ఫేస్బుక్ లకు భారీ షాక్!
ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో హల్ చల్ చేస్తున్న చాటింగ్ యాప్స్ కు దీటుగా తన సరి కొత్త యాప్ ను లాంచ్ చేసింది. అలో (ALLO)' పేరిట గూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా ఈ యాప్ ను అందుబాటులో ఉంచింది. ప్రతి రోజు స్నేహితులు, కుటుంబంతో సన్నిహితంగా ఉండడానికి వీలుగా తమ యాప్ ను రూ పొందించామని గూగుల్ గ్రూప్ ప్రొడక్షన్ మేనేజర్ అమిత్ ఫులే చెప్పారు.
సంప్రదాయ చాటింగ్ యాప్ లకు భిన్నంగా ఈ అల్లో యాప్ లో ఎన్నో ప్రత్యేకతలను పొందు పరిచారు. ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ ద్వారా ప్రివ్యూ ఎడిషన్, స్మార్ట్ రిప్లై అనే పీఛర్లను అందిస్తున్న ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేస్తుంది. ప్రముఖ ఆర్టిస్టులతో రూపొందించిన 200పైగా స్టికర్లతోపాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ , అదనపు గోప్యతా లక్షణాలు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. 'అలో' చాటింగ్ కోసం ఎమోజీలు, స్టిక్కర్లు అందించడంతోపాటు, ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను కూడా యూజర్లు సెండ్ చేసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దింది. అలాగే ఇన్‌బిల్ట్‌గా గూగుల్ సెర్చ్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా చాటింగ్ చేసే సమయంలోనే అదే విండోలో తమకు కావల్సిన సమాచారాన్ని వెతుక్కోవచ్చు. క్రీడా స్కోర్లు, వాతావరణ వివరాలు, ప్రయాణ సమయం లేదా విమానం స్థితి , రెస్టారెంట్ల వివరాలను కూడా దీని ద్వారా శోధించవచ్చట. కొత్త స్టిక్కర్స్, ఫాంట్ సైజ్ లోమార్పులు, ఫోటోలతోపాటు, ఎదుటి వ్యక్తినుంచి వచ్చే కొన్ని ప్రశ్నలకు ఈ ఇంటిలిజెంట్ యాప్ సమాధానాలను ఇస్తుంది. అంటే మనం తరచుగా వాడే హా, లాల్ లాంటి ఇతర పదాలను గుర్తించి దానికనుగణంగా సమధానాన్ని ఇస్తుందట.
వాట్సప్ లోలాగానే మొబైల్ నెంబర్ తో ఈ అల్లో యాప్ లింక్ అయి ఉంటుంది. ఇక గూగుల్ ఖాతాతో లింక్ అయి ఉండటం వల్ల యాజర్ చూస్తున్న వీడియోలు, వెతికే విషయాల ఆధారంగా అతని ప్రవర్తనను, అవసరాలను ఈ యాప్ అంచనా వేస్తుందట. వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ తో పాటు గూగుల్ మ్యాప్స్ ను కూడా ఇందులో పంపుకునే వీలుంది. అంతేకాదు ఈ కొత్త యాప్ లో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా (ఉదాహరణకు, భార్య లేదా బాస్) సలహాలు అందిస్తుందట. కాగా అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన గూగుల్ అలో యాప్ మిగిలిన చాటింగ్ యాప్ లకు ప్రతికూల అంశమని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.