విభజనతో సాగునీటికి ఎసరు!
చర్చ: కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి జిల్లాలకు విభజన వల్ల నీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందించే కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండలోని ఎస్ఎల్బిసి, రాయలసీమ జిల్లాలకు సాగునీటికి ఉద్దేశించిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
నిరంతర కరువులకు, వెనుకబాటుతనానికి కేంద్రబిం దువుగా కొనసాగుతున్న ప్రాంతం రాయలసీమ అని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. జలయజ్ఞం లాంటి ప్రతిష్టాత్మకమైన పథకం అమలుపరిచిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యంత తక్కువ సేద్యపు నీటి వసతి గల జిల్లా అనంతపురం జిల్లాయే. రాయలసీమలో తుంగభద్ర నుంచి పొందాల్సిన జలాల వాటా క్రమేపీ తగ్గిపోతున్నది. తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె.సి.కెనాల్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ తీవ్రమైన నీటి లభ్యత సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నాయి. వైఎస్ మరణం తర్వాత తెలుగుగంగ, మద్రాసుకు తాగునీరు అందించే పథకం, శ్రీశైలం కుడి కాలువ, దాని పొడిగింపుగా గండికోట ప్రాజెక్టు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరందించే పథకాలు నత్తనడకన నడుస్తున్నాయి. మరోవైపు గాలేరు-నగరి పథకం తీవ్ర జాప్యాన్ని చవిచూస్తున్నది. ఇక కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల తాగునీటికి, సాగునీటికి ఉద్దేశించిన హంద్రీ-నీవాకు కేటాయించిన నిధులు వందల కోట్ల మేర మురిగిపోయాయి.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే క్రమంలో రాయలసీమవాసులు లెక్కకుమిక్కిలిగా త్యాగాలు చేశారు. 1901లో మెకంజీ పథకం కుదింపు, 1937లో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం అమలుకు నోచు కోకపోవడం, కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు స్థానే సిద్ధేశ్వరం ప్రాజెక్టు మొదలుకుని, కోస్తా-తెలంగాణల ప్రయోజనాల కోసం నాగార్జునసాగర్‌ను సమ్మతించడం అరుదైన త్యాగం. ఆ తర్వాత ఖోస్లా కమిటీ సిఫార్సుల మేరకు సిద్ధేశ్వరం ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టు నిర్మించకపోయినా సహించారు, భరించారు. చరిత్రలో సీమకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి వైఎస్ ఎనలేని కృషి చేశారు. ఈ ప్రాంతంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు త్యాగధనులు. విశాల దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలను చూశారే కానీ, తమ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందనే ధ్యాసే వారికి లేదు. త్యాగం స్వార్థం ఎరుగదు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం శ్రమిస్తూనే ఇతర ప్రాంతాల బాగుకు వారు కృషి చేశారు.
రాష్ట్రంలో నిర్మించిన, నిర్మిస్తున్న సేద్యపు నీటి ప్రాజెక్టులు దాదాపు 80 శాతం నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిల కృషి ఫలితమే. రైతు బాంధవులుగా పేరుగాంచిన వీరు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం. రాయలసీమవాసుల విశాల మనస్తత్వానికి నిదర్శనాలు ఎన్నో. తెలంగాణకు చెందినవాడనే అంశం పరిగణనలోకి తీసుకోకుండా పీవీ నరసింహారావును నంద్యాల నుంచి రికార్డు మెజారిటీతో గెలిపించడం. అలాగే ఎన్.టి.రామారావును 15 ఏళ్లకు పైగా హిందూపురం ఎంఎల్ఏగా బలపరచడం. జన్మనిచ్చిన ప్రాంతంలో ప్రజలు ఛీకొట్టి ఓడించిన నటుడు చిరంజీవిని అక్కున చేర్చుకొని తిరుపతి నుంచి గెలిపించిన ఘనత కూడా సీమవాసులదే. స్వాతంత్య్ర పోరాటంలో సమరశీల చరిత్ర కలిగిన ప్రాంతం అనంతపురం. జాతీయ నాయకులు నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డిలను అందించింది ఈ జిల్లాయే. కల్లూరు సుబ్బారావు, పప్పూరి రామాచార్యులు, విద్వాన్ విశ్వం, నీలం రాజశేఖరరెడ్డి వంటి మహానాయ కుల్ని తెలుగు జాతికి అందించింది కూడా రాయలసీమే.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమచరిత్రను, త్యాగా లను, రాజకీయ ఔన్యత్యాన్ని, అస్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాయల తెలంగాణ, సీమాంధ్రల పేరిట సీమ ప్రత్యేక అస్తిత్వాన్ని మంట గలిపే కుట్ర ఒకటి జరుగుతున్నది. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో బళ్ళారి నుంచి వెళ్లగొట్టారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు కోసం గిద్దలూరు, కంభం, మార్కాపురం, కనిగిరి, పొదిలి, ఉదయగిరి ప్రాంతాలను రాయలసీమ ప్రాంతం నుంచి కుదించారు. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ పేర కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కడప, చిత్తూరు జిల్లాలను కోస్తాంధ్రలో కలిపి సీమాంధ్ర పేర మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రహస్య వ్యూహ రచన సాగుతున్నది. రాయలసీమలో ఎదుగుతున్న రాజకీయ నాయకత్వాన్ని, ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ ఎదుగుదలను నిలువరించడమే ఏకైక లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నది. సమైక్య రాష్ట్రం కోసం తెలుగు ప్రజల సర్వతో ముఖాభివృద్ధి కోసం కృషి చేసిన ముందుతరం నేతల కుమారులు, రాజకీయ వారసులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి రాయల సీమను చీల్చడానికి జరుగుతున్న కుట్రను బహిరంగంగా వ్యతిరేకించకపోవడం దారుణం.
విభజనలు కోరేవారు తెలంగాణవారు కావచ్చు. రాయలసీమవారు కావచ్చు. రాష్ట్రాన్ని విడదీసే ప్రక్రియలో సాగునీటి పంపకాలపైనే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కరువు పరిస్థితులను ఎదు ర్కొంటున్న రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ వంటి జిల్లాలకు విభజన వల్ల నీటి సమస్యలు తీవ్రతరం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందిం చే కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్లగొండలోని ఎస్ఎల్బిసి, రాయలసీమ జిల్లాలకు సాగునీటికి ఉద్దేశించిన గాలేరు - నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే సుమారు 227 టిఎంసీల నీరు అవసరమవుతుంది.
అయితే బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే... మిగులు జలాలను వాడుకునే అవకాశం మనకు ఉండదు. ఈ నీటిని ఎగువ రాష్ట్రాలకు కూడా ట్రిబ్యునల్ పంపిణీ చేసింది.
దాంతో వరద నీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు సాధ్యం కాదు. ఫలితంగా ఈ ప్రాజెక్టులపై ఆధార పడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండతో పాటు రాయలసీమ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి. సాగునీటికే కాదు.... తాగునీటికి కటకట లాడుతున్న ఈ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదంలో పడతాయి. అలాగే గోదావరి జలాలను కృష్ణలోకి ప్రత్యేకించి కృష్ణా-డెల్టా, పులిచింతల, నాగార్జునసాగర్ లోకి తరలించుకోవడం అతిపెద్ద సవాలు కాబోతున్నది. పోలవరం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్ర ప్రజలకు గుండెకాయ లాంటిది. గోదావరి నదిపై వైఎస్ ప్రతిపాదిం చిన మరో నాలుగు బృహత్తర ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా తెలుగు ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి ఉద్దేశించినవే. వైఎస్ చేపట్టిన జలయజ్ఞంలోని 83 ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం తెలంగాణకే కేటాయించారు. ఇందులో ప్రాణహిత-చేవేళ్ల, కంతనపల్లి, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టులు చెప్పుకోదగ్గవి. పోలవరం, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ పథకం ద్వారా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగునీటి అవసరాలు కూడా తీరుతాయి.
గత నాలుగేళ్లుగా జలయజ్ఞం ప్రాజెక్టులను రోశయ్య, కిరణ్ సర్కారులు నిర్లక్ష్యం చేశాయి. నేడు వారే సమైక్య రాష్ట్రం విడిపోతే ప్రాజెక్టులు పరిపూర్తి కావని, అప్పడు తెలుగు ప్రజలు నష్టపోతారని చెపుతున్నారు. మరోవైపు ప్రత్యేక తెలంగాణ అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ప్రాజెక్టుల సాధనకు, పరిపూర్తికి జరిపిన కృషి ఏమీలేదు. సకాలంలో ప్రాజెక్టులు నిర్మించక, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని రెండు లేదా మూడు రాష్ట్రాలుగా విభజించే దిశగా తమ రాజకీయ పావులు కదుపుతున్నారు. విభజన వాదు లకు ఓట్లు-సీట్లు కేంద్రబిందువుగా ఉండటం తెలుగు వారంతా గమనిస్తున్నారు. తెలుగుప్రజల సర్వోతోముఖా భివృద్ధితో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ, కోసాంధ్రల్లో ఏకకాలంలో తెరవెనుక నుంచి ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు నడుపుతున్నారు. స్వార్థరాజ కీయ ప్రయోజనాల సాధనకు అనైతిక, కూట్రపూరిత పద్ధతులు అవలంబిస్తున్నారు. రాయలసీమ రాజకీయ, సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. వీరి దురాలోచనలను, కుతంత్రాలను ప్రజలు గమని స్తున్నారు. అర్థం చేసుకుంటున్నారు.