ఇంటర్ ప్రత్యేక తరగతులు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారికోసం ప్రత్యేక శిక్షణ తరగతులు (రెమిడియల్ శిక్షణ)కు శ్రీకారం చుట్టింది. వీరందరికీ ఈ నెల 21 వరకు (21 రోజులపాటు) తరగతులు నిర్వహించి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన శిక్షణకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి అధికారులు ఏర్పాట్లు చేశారు.
మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు పోయినవారికి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. రెండు షిఫ్టుల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. తరగతుల నిర్వహణ, కాలేజీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెసిడెన్షియల్ తరహా శిక్షణపై కూడా అధికారులు దృష్టి సారించారు. విద్యార్థుల ఆసక్తి మేరకు డివిజనల్ కేంద్రాల్లో హాస్టల్ వసతి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఫెయిలైన బాలికలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన బాలికలకు కూడా రెసిడెన్షియల్ శిక్షణ అందించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి పూర్తి రక్షణ వాతావరణం ఉండే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో వసతి, శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన విధానం ఎంచుకుని తరగతులకు హాజరు కావచ్చు.
బీసీ గురుకులాల్లో ఫెయిలైన విద్యార్థులు 195 మంది ఉండగా.. వారికి ఆన్లైన్, రెసిడెన్షియల్ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వారికి ఆన్లైన్లోనూ, అంతకు మించి విద్యార్థులు ఉన్నచోట 14 సెంటర్లలో రెసిడెన్షియల్ తరగతులకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ పాసైనా మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు కూడా రెమిడియల్ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఫీజు చెల్లించడానికి మే 3 చివరి తేదీ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం సాయంత్రంలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది.