కబడ్డీ చాంప్ ఎస్ఆర్ఆర్
విజయవాడ స్పోర్ట్స్/విజయవాడ రూరల్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్‌ను విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని వికాస్ బీపీఈడీ కళాశాలలలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో జగ్గయ్యపేట ఎస్జీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై 28-32 తేడాతో ఎస్ఆర్ఆర్ కళాశాల జట్టు ఘన విజయం సాధించింది. ఎస్ఆర్ఆర్ కళాశాల క్రీడాకారులు శ్రావణ్, సందీప్, కుమార్, సర్దార్, నరసింహ ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచి జట్టుకు విజయాన్ని అందించారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఎస్జీఎస్ జట్టు ద్వితీయ స్థానం పొందింది. మూడు నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల జట్టుపై 28-34 తేడాతో విజయా బీపీఈడీ కళాశాల జట్టు వియజం సాధించింది. ఈ పోటీల్లో టి.శ్రావణ్‌కుమార్ (ఎస్ఆర్ఆర్) బెస్ట్ రైడర్‌గా, కె.నవీన్ (జగ్గయ్యపేట ఎస్జీఎస్) బెస్ట్ డిఫెన్స్ ప్లేయర్ అవార్డుల కింద రూ.2వేల నగదు బహుమతిని అందుకున్నారు. అంతర్ కళాశాలల పోటీల్లో ప్రోత్సాహాక నగదు బహుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. పోటీల అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నున్న సర్పంచ్ కర్రె విజయకుమార్, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు, వికాస్ విద్యా సంస్థల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి, న్యాయవాది రాజేశ్వరరావు, వికాస్ బీపీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.