విశాఖ– ప్రకాశం మ్యాచ్ డ్రా
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రా పబ్లిక్ స్కూల్లోని ఏసీఏ, ఎస్‌కేఆర్‌బీఆర్ క్రికెట్ గ్రౌండ్లో ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–14 ఎలైట్ గ్రూపు అంతర్ జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలలో ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల మ్యాచ్ డ్రాగా ముగిసింది. విశాఖ క్రీడాకారుడు నితీష్ 138 పరుగులు చేయడమే కాక రెండో ఇన్సింగ్‌లో 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ చూపాడు. నితీష్ సెంచరీతో విశాఖ జట్టు మొదటి ఇన్నింగ్‌లో భారీ స్కోర్ సాధించింది. శనివారం 132 పరుగులు ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించి 3వికెట్ల నష్టానికి 244 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ప్రకాశం జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విశాఖ జట్టు గెలుపు కోసం కేవలం 44 పరుగులు అవసరం కాగా, అప్పటికే మ్యాచ్ సమయం ముగిసిపోవడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించిన విశాఖ జట్టుకు 3 పాయింట్లు, ప్రకాశం జట్టుకు 1 పాయింట్ లభించింది. కాగా అండర్ –14 ఎలైట్ గ్రూప్ అంతర్ జిల్లాల సెలక్షన్ కమిటీ చైర్మన్ ప్రసాద్‌రెడ్డి మ్యాచ్‌ను తిలకించారు. జిల్లా మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి కె.శోభన్‌బాబు ప్రత్యేక పరిశీలకుడిగా హాజరయ్యారు. గ్రౌండ్ ఇన్చార్జ్ కేవీ పురుషోత్తంరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.