ఏంటీ బదిలీలు?
అడ్డగోలుగా అంతర్ జిల్లా బదిలీలు ఎలా వస్తున్నాయ్..
వారిని చేర్చుకోకుండా వెనక్కు పంపాలి : ఉపాధ్యాయ సంఘాలు
నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకోం : జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి
అంతర్ జిల్లా బదిలీలను జిల్లాలో అనుమతించడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాలో ఇప్పటికే స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో భారీ వ్యత్యాసముందని, అయినప్పటికీ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో వచ్చే బదిలీలను అనుమతించడం దారుణమని తప్పుబట్టాయి. జిల్లా యంత్రాంగానికి, జిల్లా పరిషత్ పాలకవర్గానికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా విద్యాశాఖ ఏకపక్షంగా వ్యవహరించి అంతర్ జిల్లా బదిలీలను అనుమతించడంతో జిల్లాలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డాయి. జిల్లాకు అడ్డగోలుగా వస్తున్న టీచర్ల ప్రభుత్వ ఉత్తర్వుల బదిలీలపై రెండు రోజుల క్రితం ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనంతో జిల్లా పరిషత్ పాలకవర్గంలో కదలిక వచ్చింది. మంగళవారం జిల్లా పరిషత్‌లో చైర్పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నేతలు విద్యాశాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సైతం డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో డీఈఓ రమేష్ స్పందిస్తూ ఇకపై అంతర్ జిల్లా బదిలీలపై జెడ్పీకి సైతం సమాచారమిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి రిమార్క్స్ వచ్చిన వెంటనే కలెక్టర్‌తోపాటు జెడ్పీకి తెలియజేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో సైపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటుచేసి ప్రత్యేక డీఎస్సీకి ప్రణాళిక తయారు చేయాలని, ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నేతలు యూ.పోచయ్య, మాణిక్‌రెడ్డి, శివకుమార్, చెన్నకేశవరెడ్డి, సదానంద్, ప్రవీణ్‌కుమార్, ఆంజనేయులు, విఠల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.