మార్చి 9 నాటి పరీక్ష 19న!
మార్చి 9న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 9న జరగాల్సిన ద్వితీయ సంవత్సర పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. 9న ఎన్నికల పోలింగ్ ఉన్నందున అదే రోజు జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సర మ్యాథ్స్–2బీ, జువాలజీ పేపరు–2, హిస్టరీ పేపరు–2 పరీక్షలను 19న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధిం చిన ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారమే సంతకం చేసినట్లు తెలిసింది. మరోవైపు 9న ఎన్నికల విధుల్లో ఉండే టీచర్లు, లెక్చరర్లు ఓటు వేసేందుకు సాయంత్రం 2 గంటలు అదనంగా పోలింగ్‌కు అవకాశం ఇస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
అయితే ఎన్నికలు జరిగే మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న దాదాపు 1,800 మంది లెక్చరర్లకు వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో పరీక్షల విధులు కేటాయించారు. దీంతో వారు పరీక్ష పూర్తయ్యాక రెండు గంటల్లో వచ్చి ఓటు వేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో 9వ తేదీ నాటి పరీక్షను 19కి వాయిదా వేయాలని నిర్ణయించింది. మరోవైపు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ పదో తరగతి పరీక్ష ఏదీ లేకపోవడంతో వాటి నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.