సౌత్‌జోన్‌కు మరో పరాజయం
సాక్షి, హైదరాబాద్: ఎన్సీఏ అండర్–16 ఇంటర్ జోనల్ క్రికెట్ టోర్నమెంట్లో సౌత్‌జోన్ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఈసీఐఎల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 140/2తో రెండోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఈస్ట్‌జోన్ జట్టు 67 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. దిబ్యా మజుందార్ (64) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం సౌత్ జోన్ జట్టు 64 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. శుభాంగ్ హెగ్డే (69), ప్రతీక్ రెడ్డి (34) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సుశాంత్ మిశ్రా, పంకజ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు.
ఎన్ఎఫ్సీ గ్రౌండ్స్‌లో వెస్ట్‌జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌జోన్ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/2తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌జోన్ జట్టు 65 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగులు చేసింది. మయాంక్ (63), అన్మోల్ శర్మ (56) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్ట్‌జోన్ బౌలర్లలో యతిన్, యువరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్ట్‌జోన్ 55.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ప్రజ్ఞ్నేశ్ (52), వరుణ్ (56), యశస్వి జైశ్వాల్ (64) అర్ధసెంచరీలు చేశారు. నార్త్‌జోన్ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ముస్తఫా యూసుఫ్ 54 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.