సివిల్స్ విజేతలతో కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన విజేతలు బుధవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారిని కేటీఆర్ అభినందించారు.
ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల అకాంక్షల వంటి అంశాల మీద తన అలోచనలను కేటీఆర్ వారితో చర్చించారు. సూమారు 20 మంది సివిల్ ర్యాంకర్లు మంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధించిన మీకు ఇక ఉద్యోగమే అసలైన పరీక్షలా ఉంటుందన్నారు. ముఖ్యంగా అధికారులుగా ప్రజల అకాంక్షలకి అనుగుణంగా పనిచేయాలని కోరారు. పరిపాలనలో అనేక ఒడిదుడుకులుంటాయని, ఎప్పడూ తమ ఆశయాన్ని వదులుకోవద్దన్నారు.
ప్రజల కోసం పనిచేయడంలో ఉన్న సంతృప్తి మిమ్మల్ని ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఉద్యోగ ప్రయాణంలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురవుతాయన్నారు. కానీ, తొలినాళ్లలో ఉన్న స్తూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లుకు దూరంగా ప్రజాసంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని హితవుపలికారు. ప్రజల భాగసామ్యంతో పనిచేస్తూ, వారిలో సమిష్టి తత్వం నెలకొల్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయాలని కోరారు. చాల సందర్భాల్లో పరిపాలనలో నిధులకన్నా, మంచి అలోచనలతో చేసే పనులకు ఫలితాలు వస్తాయన్నారు. ఆ దిశగా పనిచేయాలని కోరారు.
మంత్రిని కలవడం పట్ల ర్యాంకర్లు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చిన సలహాలు సూచనలు తమకి సరికొత్త దిశానిర్ధేశం చేశాయన్నారు. ప్రజలకోసం పనిచేయాలనే తమ అలోచనలకి మరింత ఊతం ఇచ్చాయన్నారు. తెలంగాణ విద్యార్థులు సివిల్స్ పరీక్ష ప్రిపేరేషన్ కోసం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరారు. తాను ముఖ్యమంత్రి దృష్టికి వారి సలహాలను తీసుకెళ్తానని మంత్రి హమీ ఇచ్చారు.