బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కోత
న్యూఢిల్లీ: సేవింగ్స్ వడ్డీరేట్లపై కోత పెట్టిన బ్యాంకుల జాబితాలోకి తాజాగా మరో బ్యాంక్ కూడా చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు నగదు నిల్వల వడ్డీరేటుపై 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది.
పొదుపు ఖాతాల్లో రూ. 50లక్షల కంటే తక్కువ ఉన్న నిల్వలపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేడు 3.5శాతంగా ఉండనుంది. ‘పొదుపు ఖాతాలపై బ్యాంక్ రెండంచెల విధానాన్ని అమలుచేయనుంది. దీని ప్రకారం రూ. 50 లక్షల లోపు 3.5శాతంగానూ, రూ. 50లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే.. యధావిధిగా 4శాతం వడ్డీరేటు ఉంటుంది’ అని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నేటి నుంచే ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని చెప్పింది.
కాగా జూలై 31 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను కోతపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఇదే బాటలను అనుసరించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కర్ణాటక బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.