ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిద్దాం
అనంతపురం అర్బన్ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో 21 రోజుల్లో అనుమతులివ్వాలని అధికారులను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అందించే క్రమంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ (డీపీఐసీ) సమావేశం కలెక్టర్ అధ్యోతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల మంజూరులో జాప్యం చేయడం వల్ల లక్ష్యం నెరవేదన్నారు. సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్‌బాబు వివరించారు. ఆన్లైన్లో నమోదైన ప్రతి దరఖాస్తుని కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుడు స్థాపించిన పరిశ్రమ, దాని పనితీరుని పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు.
లబ్ధిదారుల యూనిట్లను జియోట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 31 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ కోరుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 27 పరిశ్రమలకు రూ.4.27 కోట్లు పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదం తెలిపారు. నాలుగింటిని తిరస్కరిస్తూ వాటిని మరోమారు విచారణ చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మీ సేవ ద్వారా నమోదైన దరఖాస్తుల్లో 821 ప్రతిపాదనల్లో 104 ప్రతిపాదనలను మళ్లీ సమీక్షిస్తామన్నారు. హిందూపురం, గుడిపల్లి, గుత్తిలో ఉన్న పారిశ్రామిక వాడలో పరివ్రమలు స్థాపించేందుకు ఎనిమిది ప్లాట్లు కేటాయించాలని కమిటీ నిర్ణయించింది. కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పరిధిలో నిరంత విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్రెస్ ఫీడర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఎల్డీఎం జయశంకర్, డీపీఓ జగదీశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.