2,908 జేఎల్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,908 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం సీఎం కిరణ్ సంతకం చేసినట్లు తెలిసింది. 4,523 ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ 132 జీవో ద్వారా గతంలోనే ఆమోదం తెలిపింది. అయితే ఆ ఖాళీ లన్నింటినీ భర్తీ చేస్తే కాంట్రాక్టు లెక్చరర్లు అందరినీ తొలగించాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యా యి. ఆ ఖాళీలన్నీ భర్తీ చేయవద్దని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. దీంతో అన్నింటినీ ఒకేసారి కాక దశలవారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా మొదట 2,908 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో 2,262 జూనియర్ లెక్చరర్(జనరల్) ఉండగా, 646 వొకేషనల్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. దీనిపై సెకండరీ విద్యాశాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. తర్వాత ఇంటర్మీడియెట్ విద్యాశాఖ ఖాళీలకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను ఏపీపీఎస్సీకి అందజేయనుంది. అనంతరం వివిధ పోస్టులతోపాటు ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.