జయరామ్, పవార్ ఓటమి
చాంగ్జూ (చైనా): ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో విశేషంగా రాణించాక పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు అజయ్ జయరామ్ నిరాశపరిచాడు. చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జయరామ్ 14-21, 21-23తో యుకున్ చెన్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఐబీఎల్‌లో చాంపియన్ హైదరాబాద్ హాట్‌షాట్స్ తరఫున పాల్గొన్న జయరామ్ ప్రపంచ 13వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్పై, ప్రపంచ ఐదో ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్పై, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ జార్గెన్షన్పై సంచలన విజయాలు సాధించాడు.
అయితే అలాంటి ప్రదర్శనను చైనా ఓపెన్‌లో పునరావృతం చేయలేక తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) నుంచి ‘వాకోవర్’ పొందిన మరో భారత ప్లేయర్ ఆనంద్ పవార్ రెండో రౌండ్లో 21-12, 14-21, 16-21తో షో ససాకి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో నెగ్గిన ఈ ముంబై ప్లేయర్ ఆ తర్వాత తడబడ్డాడు.