'ఎయిడ్స్' లో 'కండోమ్' సందడి
డర్బన్: మానవాళిని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తరిమేసే దిశగా దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 21వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ (ఐఏసీ) పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ(ఐఏఎస్) ఆధ్వర్యంలో జులై 17 నుంచి 22 వరకు సాగిన సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ఐఏఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. రెండేళ్లకు ఓ సారి ఈ సదస్సును నిర్వహిస్తారు.
ఈ ఏడాది 'Access Equity Rights Now' (సమానత్వపు దారిలో) థీమ్ తో నిర్వహించిన సదస్సులో హెచ్ఐవీ బాధితులు, వ్యాధిపై పోరాడుతోన్న డాక్టర్లు, నర్సులు, ఎన్ జీవోలు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు సెషన్ల వారీగా తాము చేస్తున్న పనులను వివరించారు. ప్రస్తుత ఐఏఎస్ అధ్యక్షుడు క్రిస్ బేయర్ సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. మారుమూల ప్రాంతాలకు హెచ్ఐవీ నిపుణులను పంపడం, రోగ సంబంధిత ఔషధాల తయారీని ప్రోత్సహించడం, ఆ మేరకు ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులపై ఉన్న ఆంక్షలు తొలిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడితేవడం లాంటి తీర్మానాలు చేశారీ సదస్సులో.
కాగా, గత సదస్సుల్లో లాగే ఈ ఏడాది కూడా బ్రెజిలియన్ డిజైనర్ ఆండ్రియానా బెర్టిని రూపొందించిన కండోమ్ దుస్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదస్సుకు హాజరైనవారిలో చాలామంది గులాబి రంగు కండోమ్ లు ధరించిన మెనిక్వీన్ ల వద్ద చేరి సందడి చేశారు. వాటితోపాటు కొన్ని పాత ఫొటోలు కూడా మీకోసం..