International Air Transport Association
-
ఎయిర్‌లైన్స్‌కు లాభాల పంట
ఇస్తాంబుల్: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు స్థానిక ఎకానమీలు కోలుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించనుంది. దాదాపు 9.8 బిలియన్ డాలర్ల మేర నికర లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ఐఏటీఏ వార్షిక సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విలీ వాల్‡్ష ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రజలు వివిధ అవసరాల రీత్యా విమాన ప్రయాణాలు చేయడం పెరుగుతోందని, 2019 నాటి (కోవిడ్ పూర్వం) స్థాయితో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 90 శాతానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయాలు రద్దీగా ఉంటున్నాయి. హోటళ్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి మళ్లుతోంది. దీంతో పరిశ్రమ ఈ ఏడాది 803 బిలియన్ డాలర్ల ఆదాయంపై 9.8 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని వాల్‡్ష చెప్పారు. ఐఏటీఏలో పలు భారతీయ ఎయిర్‌లైన్స్‌తో పాటు 300 పైచిలుకు విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. సవాళ్లు ఉన్నాయి.. ఏవియేషన్ పరిశ్రమ కోవిడ్ మహమ్మారి తర్వాత కోలుకుంటున్నప్పటికీ.. వ్యయాలపరమైన ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లు వెన్నాడుతున్నాయని వాల్‡్ష చెప్పారు. సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించడంలో పరికరాలు, విమానాల తయారీ సంస్థలు వేగంగా స్పందించకపోతుండటం వల్ల ఎయిర్‌లైన్స్‌కు వ్యయాలు పెరిగిపోతున్నాయని, విమానాలను వినియోగంలోకి తేలేకపోతున్నాయని చెప్పారు. దీనికి తగిన పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా పర్యావరణ అనుకూల ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) ఉత్పత్తిని పెంచాల్సి ఉందని వాల్‡్ష చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఒక విధానాన్ని పాటిస్తే ప్రయోజనం ఉండగలదని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి (నెట్ జీరో) తగ్గించుకోవడానికి అవసరమైన దానితో పోలిస్తే ఎస్ఏఎఫ్ ఉత్పత్తి 0.1 శాతం కూడా లేదని వాల్‡్ష చెప్పారు. అయితే, ట్రెండ్ మాత్రం సానుకూలంగా ఉందని.. ప్రతి బొట్టు ఎస్ఏఎఫ్ను పరిశ్రమ కొని, వినియోగిస్తోందన్నారు. 2022లో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి 300 మిలియన్ లీటర్లకు చేరింది. ఎయిర్‌లైన్స్ 350 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. సానుకూల విధానాలతో 2030 నాటికి 30 బిలియన్ లీటర్ల ఉత్పత్తి లక్ష్యాన్ని కాస్త కష్టమే అయినా సాధించవచ్చని వాల్‡్ష చెప్పారు. 2050 నాటికి 450 బిలియన్ లీటర్ల ఎస్ఏఎఫ్ అవసరమవుతుందన్నారు. రేట్లు సముచితంగా ఉండేలా చూడండి ఎయిర్‌లైన్స్‌కి కేంద్ర మంత్రి సింధియా సూచన గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రకటనతో పలు రూట్లలో విమాన టికెట్ల రేట్లు భారీగా పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూప్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. టికెట్ చార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గో ఫస్ట్ గతంలో సర్వీసులు నడిపిన రూట్లలో చార్జీలు సముచిత స్థాయిలో ఉండేలా చూసేందుకు తగు విధానాన్ని రూపొందించుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు మంత్రి సూచించారు. టికెట్ రేట్లు గణనీయంగా పెరిగిన రూట్లలో చార్జీలను స్వయంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా పరిశీలిస్తూ ఉంటుందని తెలిపారు. ఒడిషాలో రైలు ప్రమాద విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని మృతుల కుటుంబాలకు కార్గో సేవలను ఉచితంగా అందించాలని విమానయాన సంస్థలకు మంత్రి సూచించారు. ప్రస్తుతం విమాన టికెట్ల చార్జీలపై కేంద్రం నియంత్రణ తొలగించింది. విమానయాన సంస్థలు సీట్ల లభ్యతను బట్టి వివిధ స్థాయుల్లో చార్జీలను నిర్ణయిస్తుంటాయి. సీజన్, డిమాండ్, ఇతరత్రా మార్కెట్ పరిస్థితులు బట్టి రేట్లు మారుతుంటాయి. విమానయాన సంస్థ గో ఫస్ట్ గత నెల మేలో సర్వీసులు నిలిపివేసినప్పటి నుంచి అది ఫ్లయిట్లు నడిపిన పలు రూట్లలో చార్జీలు భారీగా పెరిగాయి. -
ఎయిర్‌లైన్స్‌కు పూర్వ వైభవం.. వచ్చే ఏడాది నుంచి లాభాలే లాభాలు
జెనీవా: అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2022 సంవత్సరానికి 6.9 బిలియన్ డాలర్లు (రూ.56,580 కోట్లు) నష్టాలను ప్రకటించొచ్చని.. వచ్చే ఏడాది నుంచి లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు వ్యయ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అధి ప్రయాణికుల రవాణా నష్టాలు తగ్గేందుకు అనుకూలిస్తాయని తెలిపింది. ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ జెనీవాలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంతో పోలిస్తే భారత్ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి రికవరీని చూసినట్టు చెప్పారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను, వాటి విడిభాగాలను పొందడమే సవాలుగా పేర్కొన్నారు. కరోనాతో కుదేలైన దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచిగా కోలుకోవడం తెలిసిందే. ప్రయాణికుల డిమాండ్ బలంగా ఉండడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాయి. అయితే, చైనాలోని లాక్డౌన్లు, జీరో కోవిడ్ పాలసీ, రవాణాపై ఆంక్షలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడేలా చేసినట్టు ఐఏటీఏ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే ఏడాది లాభాలు.. 2023లో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. 4.7 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. ఈ ఏడాదికి 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవచ్చన్న ఈ నివేదిక.. 2020లో 138 బిలియన్ డాలర్లు, 2021లో 42 బిలియన్ డాలర్ల కంటే చాలా తగ్గినట్టేనని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు 9.7 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవచ్చని ఐఏటీఏ జూన్‌లో అంచనా వేయడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క నార్త్ అమెరికాలోనే ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాలను కళ్ల చూసినట్టు తెలిపింది. 2023లో నార్త్ అమెరికాతోపాటు యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని సంస్థలు సైతం లాభాల్లోకి అడుగుపెడతాయని పేర్కొంది. ఇక ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా/పసిఫిక్ ప్రాంతాల్లోని సంస్థలు వచ్చే ఏడాదీ నికరంగా నష్టాలను చూస్తాయని అంచనా వేసింది. 2019లో నమోదైన ప్రయాణికుల రేటుతో పోలిస్తే ఈ ఏడాది 70 శాతంతో ముగించొచ్చని పేర్కొంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయం 727 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, వచ్చే ఏడాది 779 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
India-China: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: డ్రాగెన్ కంట్రీ చైనా కవ్వింపులకు భారత్ మరోసారి గట్టి సమాధానం చెప్పింది. చైనా జాతీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్ సస్సెండ్ చేస్తున్నట్టు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) తెలిపింది. కాగా, కోవిడ్ కారణంగా భారత విద్యార్ధులు(22వేల మంది) చైనా నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం వారి రాకను చైనా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ నుండి వచ్చే విద్యార్థులను మాత్రం చైనా ఆహ్వానించింది. ఇదిలా ఉండగా.. గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత పర్యటనకు వచ్చిన సమయంలో మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని ఆయనను కోరారు. అయినప్పటికీ చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భారత్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏప్రిల్ 20న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.."చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్ జారీ చేసిన నివాస అనుమతి ఉన్నవారు, ఇ-వీసా ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ లేదా బుక్లెట్ ఉన్నవారు, PIO కార్డ్ ఉన్నవారు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు మాత్రమే భారత్‌లోకి అనుమతించబడతారు’’ అని పేర్కొంది. ఇది చదవండి: ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ -
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఐఏటీఏలో సభ్యత్వం
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా.. వీటిలో 60 దేశీయ, 23 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. మొత్తం 247 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సంస్థ కలిగిఉంది. ఇక ఐఏటీఏ 290 ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలోనే స్పైస్‌జెట్ ఈ సంఘంలో సభ్యత్వం పొందిన తొలి భారత చౌక చార్జీల విమానయాన సంస్థగా నమోదైంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గకపోవచ్చు! న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) తగ్గింపు నిర్ణయం కేంద్రం తీసుకునే అవకాశం లేదని ఉన్నత స్థాయి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కార్పొరేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఆర్థికశాఖ ఇటీవలే కార్పొరేట్ పన్నును ఏకంగా 10 శాతం తగ్గించింది. పెట్టుబడుల పెరుగుదల, ఉపాధి కల్పన, ఉత్పత్తి ధర తగ్గడం తద్వారా వ్యవస్థలో డిమాండ్, వినియోగం పెరగడం దీని లక్ష్యం. వినియోగదారు కొనుగోలు సామర్థ్యం, డిమాండ్ పెరగడానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా తగ్గించాలని ఇటీవల కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. -
18% పెరిగిన దేశీ విమాన ప్రయాణికుల రద్దీ
న్యూఢిల్లీ : భారత్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.2 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం.. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో విమాన ప్రయాణికుల రద్దీ 7.7 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు దేశీ విమాన సంస్థలు మంచి ప్రదర్శన కనబరచడం, ఆర్థిక వృద్ధి పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలే కారణం. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం చూస్తే దే శీ విమాన ప్రయాణికుల రద్దీ మే నెలలో 18.35 శాతం వృద్ధితో 71.27 లక్షలుగా ఉంది. -
వాణిజ్య విమానానికి వందేళ్లు!
న్యూఢిల్లీ: రైట్ సోదరులు 1903లోనే విమానాన్ని ఆవిష్కరించినా.. వాణిజ్యపరంగా సేవలు ప్రారం భం కావడానికి మరో దశాబ్దం పట్టింది. నలుగురు ఔత్సాహికులు వీటికి పునాది వేశారు. సెయింట్ పీటర్స్బర్గ్-తంపా ఎయిర్‌బోట్ లైన్ సంస్థ ఏర్పాటు ద్వారా పెర్సివల్ ఫాన్స్లర్, థామస్ బెనోయి.. 1914 జనవరి 1న తొలి సర్వీసును ప్రారంభించారు. మొదటి ఫ్లయిట్‌కి టోనీ జానస్ పైలట్‌గా సారథ్యం వహించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో తంపా బే-సెయింట్ పీటర్స్బర్గ్ మధ్య నీటి మీదుగా తొలి విమానం ఎగిరింది. ఇందులో ప్రయాణించేందుకు తొలి టికెట్‌ను వేలం వేయగా.. సెయింట్ పీటర్స్బర్గ్ మేయర్ అబ్రమ్ ఫెల్ 400 డాలర్లు చెల్లించి దక్కించుకున్నారు. దాదాపు 21 మైళ్ల దూరం సాగిన ప్రయాణానికి సుమారు 23 నిమిషాలు పట్టింది. ఇలా ప్రారంభమైన విమాన సర్వీసులు..అప్పట్నుంచీ వేల మైళ్ల దూరాలకు ప్రయాణికులను చేరవేస్తూనే ఉన్నాయి. విమానాలు కూడా అనేక మార్పులకు లోనై.. ఆధునిక రూపు సంతరించుకున్నాయి. కోట్ల మందికి ఉపాధి.. ఒక్క ప్రయాణికుడితో మొదలైన విమాన సర్వీసులు ప్రస్తుతం భారీస్థాయిలో విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 80 లక్షల మంది ఏరోప్లేన్లలో ప్రయాణిస్తున్నారు. 2013లో మొత్తం ప్రయాణికుల సంఖ్య తొలిసారిగా 300 కోట్ల మార్కు అధిగమించి 310 కోట్లకు చేరింది. ఈ సంఖ్య 2014లో 330 కోట్లకు చేరొచ్చని అంచనా. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 44 శాతం. ఇక, సరుకు రవాణా విషయానికొస్తే.. ఏటా 5 కోట్ల పైచిలుకు టన్నుల సరుకులను విమానాలు రవాణా చేస్తున్నాయి. వీటి వార్షిక విలువ దాదాపు 6.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుంది. అంతర్జాతీయంగా ట్రేడయ్యే ఉత్పత్తుల విలువలో ఇది సుమారు 35 శాతం. ఐఏటీఏ నివేదిక ప్రకారం విమానయాన రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 2.2 లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడుతోంది. వివిధ దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కోణంలో చూస్తే 540 బిలియన్ డాలర్ల విలువతో.. ఈ రంగం ప్రపంచంలో 19వ స్థానాన్ని దక్కించుకుంటుంది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్ పరిశ్రమ 2014లో ఏకంగా 743 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా. ఐఏటీఏ ప్రత్యేక వేడుకలు.. వాణిజ్య విమాన సేవలు ప్రారంభమై వందేళ్లయిన సందర్భంగా ఐఏటీఏ ఈ ఏడాది ప్రత్యేక వేడుకలను తలపెట్టింది. ప్రత్యేకంగా ఫ్లయింగ్100ఇయర్స్డాట్కామ్ పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభిస్తోంది. విమాన సేవలకు సంబంధించి చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యమున్న విశేషాలను ఐఏటీఏ ఇందులో ఉంచుతుం ది. అంతేగాదు తొలి విమాన సర్వీసు ఘట్టాన్ని మరోసారి ఆవిష్కరించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అచ్చం అప్పటి ఏరోప్లేన్‌ని తలపించే విమానాన్ని సెయింట్ పీటర్స్బర్గ్-తంపా రూట్లో నడపనుంది.