ఇస్తాంబుల్: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు స్థానిక ఎకానమీలు కోలుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించనుంది. దాదాపు 9.8 బిలియన్ డాలర్ల మేర నికర లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ఐఏటీఏ వార్షిక సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విలీ వాల్‡్ష ఈ విషయాలు తెలిపారు.
ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రజలు వివిధ అవసరాల రీత్యా విమాన ప్రయాణాలు చేయడం పెరుగుతోందని, 2019 నాటి (కోవిడ్ పూర్వం) స్థాయితో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 90 శాతానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయాలు రద్దీగా ఉంటున్నాయి. హోటళ్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి మళ్లుతోంది. దీంతో పరిశ్రమ ఈ ఏడాది 803 బిలియన్ డాలర్ల ఆదాయంపై 9.8 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని వాల్‡్ష చెప్పారు. ఐఏటీఏలో పలు భారతీయ ఎయిర్‌లైన్స్‌తో పాటు 300 పైచిలుకు విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది.
సవాళ్లు ఉన్నాయి..
ఏవియేషన్ పరిశ్రమ కోవిడ్ మహమ్మారి తర్వాత కోలుకుంటున్నప్పటికీ.. వ్యయాలపరమైన ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లు వెన్నాడుతున్నాయని వాల్‡్ష చెప్పారు. సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించడంలో పరికరాలు, విమానాల తయారీ సంస్థలు వేగంగా స్పందించకపోతుండటం వల్ల ఎయిర్‌లైన్స్‌కు వ్యయాలు పెరిగిపోతున్నాయని, విమానాలను వినియోగంలోకి తేలేకపోతున్నాయని చెప్పారు. దీనికి తగిన పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా పర్యావరణ అనుకూల ఏవియేషన్ ఇంధనం (ఎస్‌ఏఎఫ్) ఉత్పత్తిని పెంచాల్సి ఉందని వాల్‡్ష చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఒక విధానాన్ని పాటిస్తే ప్రయోజనం ఉండగలదని ఆయన పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి (నెట్ జీరో) తగ్గించుకోవడానికి అవసరమైన దానితో పోలిస్తే ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తి 0.1 శాతం కూడా లేదని వాల్‡్ష చెప్పారు. అయితే, ట్రెండ్ మాత్రం సానుకూలంగా ఉందని.. ప్రతి బొట్టు ఎస్‌ఏఎఫ్‌ను పరిశ్రమ కొని, వినియోగిస్తోందన్నారు. 2022లో ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి 300 మిలియన్ లీటర్లకు చేరింది. ఎయిర్‌లైన్స్ 350 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. సానుకూల విధానాలతో 2030 నాటికి 30 బిలియన్ లీటర్ల ఉత్పత్తి లక్ష్యాన్ని కాస్త కష్టమే అయినా సాధించవచ్చని వాల్‡్ష చెప్పారు. 2050 నాటికి 450 బిలియన్ లీటర్ల ఎస్‌ఏఎఫ్ అవసరమవుతుందన్నారు.
రేట్లు సముచితంగా ఉండేలా చూడండి
ఎయిర్‌లైన్స్‌కి కేంద్ర మంత్రి సింధియా సూచన
గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రకటనతో పలు రూట్లలో విమాన టికెట్ల రేట్లు భారీగా పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూప్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. టికెట్ చార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గో ఫస్ట్ గతంలో సర్వీసులు నడిపిన రూట్లలో చార్జీలు సముచిత స్థాయిలో ఉండేలా చూసేందుకు తగు విధానాన్ని రూపొందించుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు మంత్రి సూచించారు.
టికెట్ రేట్లు గణనీయంగా పెరిగిన రూట్లలో చార్జీలను స్వయంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా పరిశీలిస్తూ ఉంటుందని తెలిపారు. ఒడిషాలో రైలు ప్రమాద విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని మృతుల కుటుంబాలకు కార్గో సేవలను ఉచితంగా అందించాలని విమానయాన సంస్థలకు మంత్రి సూచించారు. ప్రస్తుతం విమాన టికెట్ల చార్జీలపై కేంద్రం నియంత్రణ తొలగించింది. విమానయాన సంస్థలు సీట్ల లభ్యతను బట్టి వివిధ స్థాయుల్లో చార్జీలను నిర్ణయిస్తుంటాయి. సీజన్, డిమాండ్, ఇతరత్రా మార్కెట్ పరిస్థితులు బట్టి రేట్లు మారుతుంటాయి. విమానయాన సంస్థ గో ఫస్ట్ గత నెల మేలో సర్వీసులు నిలిపివేసినప్పటి నుంచి అది ఫ్లయిట్లు నడిపిన పలు రూట్లలో చార్జీలు భారీగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment