Airline industry
-
భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్
మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక మార్కెట్‌గా భావించే భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్‌లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్‌సర్‌కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2016లో ఉడాన్(ఉడే దేశ్కా అమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్‌తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి. -
వచ్చే ఏడాది 25.7 బిలియన్ డాలర్ల లాభాలు
న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్‌లైన్స్ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అంచనా వేసిన 9.8 బిలియన్ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా. 2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్ (పాలసీ, ఎకనామిక్స్) ఆండ్రూ మ్యాటర్స్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.7 శాతం మార్జిన్.. ‘అవుట్‌లుక్ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‡్ష తెలిపారు. ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కు సభ్యత్వం ఉంది. ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2023లో ఎయిర్‌లైన్స్ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ►ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2023లో 0.1 బిలియన్ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా. ►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఎయిర్‌లైన్స్‌కు లాభాల పంట
ఇస్తాంబుల్: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు స్థానిక ఎకానమీలు కోలుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించనుంది. దాదాపు 9.8 బిలియన్ డాలర్ల మేర నికర లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ఐఏటీఏ వార్షిక సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విలీ వాల్‡్ష ఈ విషయాలు తెలిపారు. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ప్రజలు వివిధ అవసరాల రీత్యా విమాన ప్రయాణాలు చేయడం పెరుగుతోందని, 2019 నాటి (కోవిడ్ పూర్వం) స్థాయితో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 90 శాతానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ‘విమానాశ్రయాలు రద్దీగా ఉంటున్నాయి. హోటళ్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నాయి. ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి మళ్లుతోంది. దీంతో పరిశ్రమ ఈ ఏడాది 803 బిలియన్ డాలర్ల ఆదాయంపై 9.8 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని వాల్‡్ష చెప్పారు. ఐఏటీఏలో పలు భారతీయ ఎయిర్‌లైన్స్‌తో పాటు 300 పైచిలుకు విమానయాన సంస్థలకు సభ్యత్వం ఉంది. సవాళ్లు ఉన్నాయి.. ఏవియేషన్ పరిశ్రమ కోవిడ్ మహమ్మారి తర్వాత కోలుకుంటున్నప్పటికీ.. వ్యయాలపరమైన ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థపరమైన సవాళ్లు వెన్నాడుతున్నాయని వాల్‡్ష చెప్పారు. సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించడంలో పరికరాలు, విమానాల తయారీ సంస్థలు వేగంగా స్పందించకపోతుండటం వల్ల ఎయిర్‌లైన్స్‌కు వ్యయాలు పెరిగిపోతున్నాయని, విమానాలను వినియోగంలోకి తేలేకపోతున్నాయని చెప్పారు. దీనికి తగిన పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా పర్యావరణ అనుకూల ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) ఉత్పత్తిని పెంచాల్సి ఉందని వాల్‡్ష చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఒక విధానాన్ని పాటిస్తే ప్రయోజనం ఉండగలదని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తటస్థ స్థాయికి (నెట్ జీరో) తగ్గించుకోవడానికి అవసరమైన దానితో పోలిస్తే ఎస్ఏఎఫ్ ఉత్పత్తి 0.1 శాతం కూడా లేదని వాల్‡్ష చెప్పారు. అయితే, ట్రెండ్ మాత్రం సానుకూలంగా ఉందని.. ప్రతి బొట్టు ఎస్ఏఎఫ్ను పరిశ్రమ కొని, వినియోగిస్తోందన్నారు. 2022లో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి 300 మిలియన్ లీటర్లకు చేరింది. ఎయిర్‌లైన్స్ 350 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. సానుకూల విధానాలతో 2030 నాటికి 30 బిలియన్ లీటర్ల ఉత్పత్తి లక్ష్యాన్ని కాస్త కష్టమే అయినా సాధించవచ్చని వాల్‡్ష చెప్పారు. 2050 నాటికి 450 బిలియన్ లీటర్ల ఎస్ఏఎఫ్ అవసరమవుతుందన్నారు. రేట్లు సముచితంగా ఉండేలా చూడండి ఎయిర్‌లైన్స్‌కి కేంద్ర మంత్రి సింధియా సూచన గో ఫస్ట్ స్వచ్ఛంద దివాలా ప్రకటనతో పలు రూట్లలో విమాన టికెట్ల రేట్లు భారీగా పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ గ్రూప్‌తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. టికెట్ చార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గో ఫస్ట్ గతంలో సర్వీసులు నడిపిన రూట్లలో చార్జీలు సముచిత స్థాయిలో ఉండేలా చూసేందుకు తగు విధానాన్ని రూపొందించుకోవాలని ఎయిర్‌లైన్స్‌కు మంత్రి సూచించారు. టికెట్ రేట్లు గణనీయంగా పెరిగిన రూట్లలో చార్జీలను స్వయంగా సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా పరిశీలిస్తూ ఉంటుందని తెలిపారు. ఒడిషాలో రైలు ప్రమాద విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని మృతుల కుటుంబాలకు కార్గో సేవలను ఉచితంగా అందించాలని విమానయాన సంస్థలకు మంత్రి సూచించారు. ప్రస్తుతం విమాన టికెట్ల చార్జీలపై కేంద్రం నియంత్రణ తొలగించింది. విమానయాన సంస్థలు సీట్ల లభ్యతను బట్టి వివిధ స్థాయుల్లో చార్జీలను నిర్ణయిస్తుంటాయి. సీజన్, డిమాండ్, ఇతరత్రా మార్కెట్ పరిస్థితులు బట్టి రేట్లు మారుతుంటాయి. విమానయాన సంస్థ గో ఫస్ట్ గత నెల మేలో సర్వీసులు నిలిపివేసినప్పటి నుంచి అది ఫ్లయిట్లు నడిపిన పలు రూట్లలో చార్జీలు భారీగా పెరిగాయి. -
వ్యాపారం లక్ష కోట్లు.. ప్రయాణికులు 12 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. గత పదేళ్ళుగా 14 శాతం చొప్పున వార్షిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశీయ విమానయాన రంగం లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. ఇదే విధమైన వృద్ధిరేటును కొనసాగిస్తే 2030 నాటికి వ్యాపార పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి స్థానం చేరుకునే సత్తా భారత్‌కు ఉందని జీఎంఆర్ గ్రూపు అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్న దేశ విమానయాన రంగం 2020 నాటికి మూడో స్థానానికి, 2030 నాటికి మొదటి స్థానానికి చేరుతుందని జీఎంఆర్ గ్రూపు విడుదల చేసిన పరిశోధనా పత్రంలో పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2013-14లో దేశీయ పౌర విమానయాన ప్రయాణికుల సంఖ్య 5.2 శాతం వృద్ధితో 12.2 కోట్లకు చేరితే విదేశీ ప్రయాణీకుల సంఖ్య 4.3 కోట్లు దాటింది. చౌక విమానయానం అందుబాటులోకి రావడానికి తోడు, విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం, ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు ఈ రంగం వేగంగా విస్తరించడానికి దోహదం చేసింది. చౌక విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ ప్రవేశించినప్పటి నుంచి అంటే 2003 నుంచి ఆరేళ్ళపాటు విమాన సర్వీసుల సంఖ్యలో ఏటా 20 నుంచి 40 శాతం వృద్ధి నమోదయ్యింది. వచ్చే ఐదేళ్లు విమాన సర్వీసుల్లో 4.2 శాతం, ప్రయాణీకుల్లో 5.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం 400గా ఉన్న విమానాల సంఖ్య ఐదేళ్ళలో 800 దాటనుందని జీఎంఆర్ పేర్కొంది.భారీ పెట్టుబడులు: దేశంలో మొత్తం 500 విమానాశ్రయాల అవసరం ఉందని ప్రభుత్వ సంస్థలు అంచనా వేశాయి. వీటిలో కనీసం 250 విమానాశ్రయాలను 2020 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనేది ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా లక్ష్యం. దీంతో వచ్చే ఐదేళ్లలో ఈ రంగం రూ.7.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతో పాటు, ఫిలిప్పైన్స్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తుం డగా, జీవీకే ముంబై, బెంగళూరు విమానాశ్రయాల ను నిర్వహిస్తోంది. దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విమానాశ్రయాలను కైవసం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.