వ్యాపారం లక్ష కోట్లు.. ప్రయాణికులు 12 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. గత పదేళ్ళుగా 14 శాతం చొప్పున వార్షిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశీయ విమానయాన రంగం లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. ఇదే విధమైన వృద్ధిరేటును కొనసాగిస్తే 2030 నాటికి వ్యాపార పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి స్థానం చేరుకునే సత్తా భారత్‌కు ఉందని జీఎంఆర్ గ్రూపు అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ పరంగా తొమ్మిదో స్థానంలో ఉన్న దేశ విమానయాన రంగం 2020 నాటికి మూడో స్థానానికి, 2030 నాటికి మొదటి స్థానానికి చేరుతుందని జీఎంఆర్ గ్రూపు విడుదల చేసిన పరిశోధనా పత్రంలో పేర్కొంది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2013-14లో దేశీయ పౌర విమానయాన ప్రయాణికుల సంఖ్య 5.2 శాతం వృద్ధితో 12.2 కోట్లకు చేరితే విదేశీ ప్రయాణీకుల సంఖ్య 4.3 కోట్లు దాటింది. చౌక విమానయానం అందుబాటులోకి రావడానికి తోడు, విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం, ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు ఈ రంగం వేగంగా విస్తరించడానికి దోహదం చేసింది. చౌక విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ ప్రవేశించినప్పటి నుంచి అంటే 2003 నుంచి ఆరేళ్ళపాటు విమాన సర్వీసుల సంఖ్యలో ఏటా 20 నుంచి 40 శాతం వృద్ధి నమోదయ్యింది.
వచ్చే ఐదేళ్లు విమాన సర్వీసుల్లో 4.2 శాతం, ప్రయాణీకుల్లో 5.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఎయిర్‌పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం 400గా ఉన్న విమానాల సంఖ్య ఐదేళ్ళలో 800 దాటనుందని జీఎంఆర్ పేర్కొంది.భారీ పెట్టుబడులు: దేశంలో మొత్తం 500 విమానాశ్రయాల అవసరం ఉందని ప్రభుత్వ సంస్థలు అంచనా వేశాయి. వీటిలో కనీసం 250 విమానాశ్రయాలను 2020 నాటికి అందుబాటులోకి తీసుకురావాలనేది ఎయిర్‌పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా లక్ష్యం.
దీంతో వచ్చే ఐదేళ్లలో ఈ రంగం రూ.7.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జీఎంఆర్ హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్‌పోర్టులతో పాటు, ఫిలిప్పైన్స్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తుం డగా, జీవీకే ముంబై, బెంగళూరు విమానాశ్రయాల ను నిర్వహిస్తోంది. దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విమానాశ్రయాలను కైవసం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.