ఏవియేషన్ షో-2016 ప్రారంభించిన ప్రణబ్
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో ఇంటర్నేషనల్ ఏవియేషన్ షో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ...సీఎం కేసీఆర్‌తో కలిసి ఏవియేషన్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగిస్తూ పౌర విమాన రంగంలో ప్రపంచంలోనే భారత్ 9వ ర్యాంకులో ఉందని, 2020 నాటికి మూడో స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతుందన్న ప్రణబ్, ఏవియేషన్ రంగంలో తయారీపై దృష్టిసారించామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఏవియేషన్ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎన్నో రక్షణ రంగ సంస్థలు ఉన్నాయని, విమానాల విడిభాగాల తయారీకి రాష్ట్రంలో రెండు ఏరో స్పేస్ పార్కులు ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.
దాదాపు 2 వందల దేశాలకు చెందిన విమానాలు, 5 రోజుల పాటు సందర్శకులను అలరించనున్నాయి. మొదటి మూడు రోజులు బిజినెస్ విజిటర్స్‌ను, అలాగే చివరి రెండు రోజులు సందర్శకులను అధికారులు అనుమతించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, తెలంగాణ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.