బంగారం డిమాండ్‌కు ధరల మంట
న్యూఢిల్లీ: బంగారానికి డిమాండ్ గడిచిన 10 రోజుల్లో పడిపోయింది. ఏకంగా 40 శాతం క్షీణించినట్టు ఉత్తరాది ఆభరణాల వర్తకులు చెబుతుంటే, దేశంలో బంగారం అత్యధికంగా అమ్ముడుపోయే దక్షిణాదిన గడిచిన రెండు వారాల్లో డిమాండ్ 60 శాతం తగ్గిపోయినట్టు ఈ ప్రాంత వర్తకులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం జీఎస్టీతో కలిపి రూ.60,000కు చేరుకోవడమే డిమాండ్ పడిపోవడానికి కారణంగా పేర్కొన్నారు.
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ మొదలవుతుందని, ఇలాంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకు సంక్షోభాలతో పాశ్చాత్య దేశాల వృద్ధిపై ప్రభావం పడుతుందని, ఆర్బీఐ రేట్ల పెంపును తగ్గించొచ్చని, లేదంటే విరామం ఇవ్వొచ్చని, ఇది మార్కెట్లో నగదు లభ్యతను పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతునిచ్చినట్టు తెలిపారు.
అస్థిరతలకు అవకాశం..
‘‘బంగారం ధరల్లో సమీప కాలంలో అస్థిరతలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు)కు 2,020 డాలర్లకు, దేశీయంగా రూ.60,500కు చేరుకోవచ్చు’’అని కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా తెలిపారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ‘‘బంగారానికి డిమాండ్ స్తబ్దుగా ఉంది.
కొనుగోళ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వేచి చూస్తోంది’’అని చెప్పారు. గడిచిన వారంలో బంగారం ధరలు ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగినట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సియమ్ మెహ్రా తెలిపారు. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ‘‘గత 10–15 రోజుల్లో డిమాండ్ 40 శాతం తగ్గింది. మరో 15 రోజుల్లో వివాహాల సీజన్ మొదలవుతున్నప్పటికీ, వేచి చూసే ధోరణితో ప్రజలు ఉన్నారు’’అని మెహ్రా వివరించారు.
సీజ్ చేసిన స్మగుల్డ్ బంగారం @ 3,502 కేజీలు
2022లో 47 శాతం అప్
స్మగ్లింగ్‌లో పట్టుబడి, ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసిన బంగారం పరిమాణం గతేడాది 3,502 కేజీలుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 47 శాతం అధికం. కేరళలో అత్యధికంగా 755.81 కేజీల బంగారం పట్టుబడింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (535.65 కేజీలు), తమిళనాడు (519 కేజీలు) ఉన్నాయి. రాజ్యసభకు ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం .. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కేజీలు, అంతక్రితం ఏడాది 2,154.58 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది (2023) తొలి మూడు నెలల్లో 916.37 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని సీజ్ చేశాయి. 2021లో 2,445 పసిడి స్మగ్లింగ్ కేసులు, 2022లో 3,982 కేసులు నమోదయ్యాయి.
బంగారం వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడంతో పసిడి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కస్టమ్స్ సుంకం రేటు 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం, ఐజీఎస్టీ రేటు 3 శాతం మొదలైనవన్నీ కలిపితే దిగుమతులపై పన్నుల భారం అధికంగా ఉంటోంది. దీనితో అక్రమ మార్గాల్లో కూడా దేశంలోకి పసిడి వస్తోంది. దీన్ని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇతరత్రా ఏజెన్సీలతో కలిసి నిరంతరం నిఘాను పటిష్టం చేస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనుసరించే కొత్త విధానాలను పసిగట్టి ఏజెన్సీలను అప్రమత్తం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.