వర్సిటీలో ఐబీఎస్ సెంటర్
ఏఎన్‌యూ: ఆంధ్రా సుగర్స్ సంస్థ ఆర్థిక సహకారంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ (ఐబీఎస్) సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం యూనివర్సిటీలో జరిగింది. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
యూనివర్సిటీలోని విద్యావిషయక భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఐబీఎస్ శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం డైక్మెన్ ఆడిటోరియంలో మంత్రి విద్యార్థులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రాబిర్లాగా పేరొందిన ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ పేరుతో నూతన రాజధానిలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమెరికాలో టాప్‌టెన్ డాక్టర్లలో ఐదుగురు మన దేశం వారైతే వారిలో సగం మంది తెలుగు వారు ఉంటున్నారని, ఇది మన మేధస్సుకు నిదర్శనమని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యాపారవేత్తలకు ఆదర్శం హరిశ్చంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన సంస్థల్లో ఒక్క రోజు కూడా బంద్ జరగలేదన్నారు. ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రసంగించారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.నరసింహారావు, శాసనమండలి మాజీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, ఏఎన్‌యూ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.శివరాం ప్రసాద్, ఆంధ్రాసుగర్స్ జేడీ పి.అచ్యుతరామయ్య, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశేష్ఠ త్రిపాఠి, పలువురు ఏఎన్‌యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.