నేనే తప్పు చేయలేదు: శ్రీశాంత్
కొచ్చి: బోర్డు తనపై జీవితకాల నిషేధం విధించడం తనను తీవ్రంగా కలచివేసిందని వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ తెలిపాడు. తన జీవితంలో ఇదే పెద్ద కుదుపు అని అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో తానేతప్పు చేయలేదని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొన్నాడు. తొమ్మిదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడు, ఏ ఒక్కరూ తనకు మద్దతుగా నిలువలేదన్నాడు. కనీసం ఇలాంటి గడ్డు స్థితిలో తనకు అండగా నిలుస్తారని ఆశించినా... అలాంటి సాంత్వనేదీ దక్కలేదని శ్రీ వాపోయాడు.
‘భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం నన్ను బాధించింది. ఈ మొత్తం ఉదంతంలో నన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో తెలీదు. ఏదేమైనా నిర్దోషిగా బయటపడతాననే నమ్మకముంది. తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాను’ అని అన్నాడు. తాను జైల్లో లేనని, బయటే ఉన్నానని... ఇదొక్కటే తనకు ఊరటనిచ్చే విషయమన్నాడు.