international champion
-
Reeni Tharakan: బామ్మ పవర్
53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్నెస్ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్ సందేశం ఇస్తోంది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.పి.ఎఫ్) చాంపియన్‌షిప్స్ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్ నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం. భారీ పోటీ మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. డెడ్లిఫ్టింగ్లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్. బరువు తగ్గడానికి వెళ్లి రీని తారకన్ కొచ్చిన్ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్కు అనిపించింది. దాంతో కొచ్చిన్ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్ లో చేరింది. ఇంటినుంచి జిమ్ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్లిఫ్టర్ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్. సమర్థింపులు, సూటిపోట్లు ‘నేను పవర్‌లిఫ్టర్ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్. -
షూటింగ్ క్రీడలో కొత్త పుంతలు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు ఆటలు రద్దవడమే చూశాం కానీ ఈ మహమ్మారి పుణ్యమా అని ఆట కొత్త పుంతలు తొక్కుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆటలో ఈ సాంకేతిక విప్లవానికి ఏప్రిల్ 15న జరుగనున్న ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌తో తెర లేవనుంది. ఎలక్ట్రానిక్ టార్గెట్ బోర్డ్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సహాయంతో ఇళ్ల నుంచే తమ లక్ష్యాలకు గురిపెట్టేందుకు షూటర్లంతా సిద్ధమయ్యారు. భారత్ నుంచి మను భాకర్, సంజీవ్ రాజ్‌పుత్, దివ్యాన్‡్ష సింగ్ పన్వర్ ఈ కొత్త విధానంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. భారత మాజీ షూటింగ్ నిపుణుడు (మార్క్స్‌మ్యాన్) షిమోన్ షరీఫ్ చొరవతో బీజం పడిన ఈ ఆన్లైన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మంది షూటర్లు పాల్గొననున్నారు. ప్రముఖ విదేశీ షూటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారంతో పాటు ఒలింపియన్ జాయ్దీప్ కర్మాకర్ కామెంటరీతో మార్మోగనుంది. 2019 ప్రపంచకప్ రెండు స్వర్ణాల విజేత వెరోనికా (హంగేరి), ఫ్రాగా కరెడోరియా (స్పెయిన్), ఎమిలా, ఇసాబెల్, ఎవాన్స్ (స్కాట్లాండ్) టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ‘కఠిన పరిస్థితుల్లోనూ షూటింగ్ క్రీడను సజీవంగా ఉంచేందుకు ఈ కొత్త తరహా విధానాన్ని ప్రయత్నిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు టోర్నీ ప్రారంభమవుతుంది. ఆటగాళ్లంతా తమ తమ ఇళ్ల నుంచే పోటీలో పాల్గొంటారు. ఆసక్తి గలవారు ఫేస్బుక్ లేదా indianshooting.com వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు’ అని షరీఫ్ తెలిపాడు. -
క్యారమ్ జట్టు మేనేజర్‌గా మదన్‌రాజ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ క్యారమ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టు మేనేజర్‌గా ఎస్.మదన్‌రాజ్ నియమితులయ్యారు. ఈ పోటీలు ఈనెల 21 నుంచి 23 వరకు హర్యానాలోని గుర్గావ్లో జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. మదన్‌రాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన జీహెచ్ఎంసీలో పని చేస్తున్నారు. ఈటోర్నీలో 11 దేశాలు పాల్గొంటాయి. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్విస్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో భారత్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, పోలండ్, మాల్దీవులు, శ్రీలంక, మలేసియా, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, కెనడా జట్లు పాల్గొంటున్నాయి.