షూటింగ్‌ క్రీడలో కొత్త పుంతలు! | Online Shooting International Championship Will Be On 15th April | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ క్రీడలో కొత్త పుంతలు!

Published Sun, Apr 12 2020 4:36 AM | Last Updated on Sun, Apr 12 2020 4:36 AM

Online Shooting International Championship Will Be On 15th April - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు ఆటలు రద్దవడమే చూశాం కానీ ఈ మహమ్మారి పుణ్యమా అని ఆట కొత్త పుంతలు తొక్కుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆన్‌లైన్‌ చాంపియన్‌షిప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆటలో ఈ సాంకేతిక విప్లవానికి ఏప్రిల్‌ 15న జరుగనున్న ఇంటర్నేషనల్‌ ఆన్‌లైన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌తో తెర లేవనుంది. ఎలక్ట్రానిక్‌ టార్గెట్‌ బోర్డ్, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సహాయంతో ఇళ్ల నుంచే తమ లక్ష్యాలకు గురిపెట్టేందుకు షూటర్లంతా సిద్ధమయ్యారు. భారత్‌ నుంచి మను భాకర్, సంజీవ్‌ రాజ్‌పుత్, దివ్యాన్‌‡్ష సింగ్‌ పన్వర్‌ ఈ కొత్త విధానంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. భారత మాజీ షూటింగ్‌ నిపుణుడు (మార్క్స్‌మ్యాన్‌) షిమోన్‌ షరీఫ్‌ చొరవతో బీజం పడిన ఈ ఆన్‌లైన్‌ చాంపియన్‌షిప్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మంది షూటర్లు పాల్గొననున్నారు.

ప్రముఖ విదేశీ షూటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారంతో పాటు ఒలింపియన్‌ జాయ్‌దీప్‌ కర్మాకర్‌ కామెంటరీతో మార్మోగనుంది.  2019 ప్రపంచకప్‌ రెండు స్వర్ణాల విజేత వెరోనికా (హంగేరి), ఫ్రాగా కరెడోరియా (స్పెయిన్‌), ఎమిలా, ఇసాబెల్, ఎవాన్స్‌ (స్కాట్లాండ్‌) టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ‘కఠిన పరిస్థితుల్లోనూ షూటింగ్‌ క్రీడను సజీవంగా ఉంచేందుకు ఈ కొత్త తరహా విధానాన్ని ప్రయత్నిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు టోర్నీ ప్రారంభమవుతుంది. ఆటగాళ్లంతా తమ తమ ఇళ్ల నుంచే పోటీలో పాల్గొంటారు. ఆసక్తి గలవారు ఫేస్‌బుక్‌ లేదా indianshooting.com వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు’ అని షరీఫ్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement