యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్‌కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.
‘ఒలింపిక్స్‌లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్‌గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా, ఒకే సీజన్‌లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్‌లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.
యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తా
షూటర్‌గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది.
గురువుకు లోబడి
మను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్‌కు థాంగ్ తా ఉపయోగపడింది.
తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ
‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్‌లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment